
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని బీసీసీఐ సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ వంటి బోర్డు.. విమెన్ టీమ్‌పై అలా వ్యవహరించి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఇంగ్లాండ్ మాజీ విమెన్ క్రికెటర్, కామెంటేటర్ ఇసా గుహ వారితో గొంతు కలిపారు. పురుషులతో సమానంగా ప్రోత్సహించగలిగితే.. మహిళ జట్టు కూడా అద్భుతాలు చేస్తుందని, దానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయట్లేదని వ్యాఖ్యానించారు.
ఇసా గుహ జన్మతః బెంగాలీ. ఆమె పూర్వీకులు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఇసా అక్కడే జన్మించారు. క్రికెట్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నారామె. పదేళ్ల పాటు ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టులో కొనసాగారు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్ తరఫున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, 83 వన్డే ఇంటర్నేషనల్స్, 22 టీ20 మ్యాచ్‌లు ఆడారు.
2009లో మహిళల ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కామెంటేటర్‌గా అవతారం ఎత్తారు. ఇంగ్లాండ్ దేశవాళీ, ఇంటర్నేషనల్స్, సూపర్ లీగ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
టీమిండియా విమెన్ క్రికెటర్లకు బీసీసీఐ చెల్లించాల్సిన ప్రైజ్‌మనీలో జాప్యం చోటు చేసుకోవడం పట్ల ఆమె స్పందించారు. క్రికెట్‌లో ఈక్వాలిటీ లోపించిందని స్పష్టం చేశారు. పురుషులతో సమానంగా మహిళలను చూడట్లేదని తేల్చి చెప్పారు. మహిళలు ఎందులోనూ తీసిపోరని, పురుషులతో సమానంగా రాణించగలరని అన్నారు.
ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లను చూడగలిగితే- అద్భుతాలను సాధిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదని ఇసా గుహ అభిప్రాయపడ్డారు. టీమిండియాను భారత మహిళల క్రికెట్ జట్టు ఖచ్చితంగా ఆధిపత్యం సాధిస్తుందని చెప్పారు.