వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అందరూ అనుకున్నట్లు కేకేఆర్ స్టార్ రింకూ సింగ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అలాగే పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. అయితే ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా ఆడిన తిలక్ వర్మకు ఈ జట్టులో చోటు దక్కింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతను ఈ సిరీసులో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
టీ20 సిరీసులో కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లను పక్కన పెట్టిన సెలెక్లర్లు కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన సంజూ శాంసన్.. మళ్లీ ఈ సిరీసుతో పునరాగమనం చేస్తున్నాడు. వన్డే జట్టులో కూడా అతనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో అదరగొట్టి. యశస్వి జైస్వాల్‌ను కూడా టీ20లకు సెలెక్టర్లు ఎంపిక చేశారు.

అయితే రింకూ సింగ్, జితేశ్ శర్మను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్‌ను తీసుకోవడంపై కూడా షాకవుతున్నారు. ఆవేష్ ఇటీవలి కాలంలో పెద్దగా రాణించింది లేదు. అతని కన్నా శివమ్ మావిని తీసుకోవాల్సిందని అంటున్నారు. కివీస్‌తో సిరీస్‌లో మావి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో కూడా ఆకట్టుకుంటున్నాడు.
సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది బృందంలో ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు స్పిన్నర్లు, నలుగురు పేసర్లు ఉన్నారు. రవీంద్ర జడేజాకు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా ఉమ్రాన్ మాలిక్, మేఖేష్ కుమార్‌కు ఈ టీంలో చోటు దక్కడం గమనార్హం. ఈ టీంలో ఫినిషర్ బాధ్యతలను సంజూ శాంసన్, అక్షర్ పటేల్ పంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
భారత బృందం: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషణ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్.