క్రికెటర్లు ఎక్కడ ఉన్నా వాళ్లు ఆట గురించే మాట్లాడుకుంటారు. ఇదే విషయాన్ని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి గుర్తుచేశాడు. ఇటీవల యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో అవుటైన విధానంపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లంతా తెగ చర్చించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పెద్ద చర్చే జరిపాడట. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
షార్ట్ బాల్‌ను ఆడకుండా వదిలేసిన ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్‌స్టో.. ఓవర్ ముగియడంతో అవతలి ఎండ్‌లో ఉన్న స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు. ఇది గమనించిన ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ.. బంతిని అందుకున్న వెంటనే దాన్ని వికెట్లపైకి విసిరాడు. దానికి ఆసీస్ అప్పీల్ చేయడంతో బెయిర్‌స్టోను అవుట్‌గా అంపైర్ ప్రకటించాడు. అయితే ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ ఇంగ్లండ్ మాజీలు తెగ గోల చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్.. బెయిర్‌స్టో అవుటా? కాదా? అని ఒక బార్‌టెండర్, ఒక వెయిటర్ ఇద్దరితో గంట సేపు చర్చ పెట్టుకున్నాడట. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని అశ్విన్ వెల్లడించాడు. ఈ సమయంలో మరో ఫ్యాన్ వచ్చి అంపైర్లు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పాడట. 'మేం ఒక బీచ్‌కు వెళ్లాం. అక్కడ రాహుల్ భాయ్ నాకు లెమన్ జూస్ తీసుకొచ్చాడు' అని అశ్విన్ తెలిపాడు.
'ఇక అప్పుడు జానీ బెయిర్‌స్టో అవుటా? కాదా? అని బార్‌టెండర్, వెయిటర్ ఇద్దరితో రాహుల్ భాయ్ గంట సేపు చర్చ పెట్టుకున్నాడు. క్రికెట్ రూల్స్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అన్నిటి గురించి వాళ్లు మాట్లాడుకున్నారు. వాళ్లు మంచి హీటెడ్ డిబేట్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఒక పెద్దాయన అక్కడకు వచ్చి.. బెయిర్‌స్టో అవుట్ అని తేల్చేశాడు' అని తమకు ఎదురైన అనుభవాన్ని అశ్విన్ వెల్లడించాడు.