టీమిండియా యువ స్టార్ పృథ్వీ షా ప్రస్తుతం చాలా పూర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో తేలిపోయిన అతను.. తాజాగా దులీప్ ట్రోఫీలో కూడా పెద్దగా రాణించలేదు. ఈ టోర్నీ ఫైనల్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన షా.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా నుంచి ఎందుకు తప్పించారో తనకు తెలియదని, ఎవరూ ఎలాంటి కారణం చెప్పలేదని షా చెప్పాడు. అయితే కొందరు తన ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారని, దీంతో ఎన్సీయేకు వచ్చి అన్ని టెస్టులు పాసయ్యానని తెలిపాడు. అయినా సరే వెస్టిండీస్ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడం చాలా బాధించిందని పృథ్వీ షా అన్నాడు. ప్రస్తుతం చాలా పేలవ ఫామ్‌లో ఉన్న అతన్ని విండీస్ టూర్‌కు సెలెక్టర్లు ఇగ్నోర్ చేసిన సంగతి తెలిసిందే.

'నన్ను టీమిండియా నుంచి తప్పించినప్పుడు.. ఎందుకు? ఏంటి? అనే కారణాలు ఎవరూ చెప్పలేదు. నా ఫిట్‌నెస్ వల్లనేమో అని ఎవరో అన్నారు. దీంతో ఎన్సీయేకు వచ్చి అని టెస్టులు క్లియర్ చేశా. మళ్లీ టీ20ల్లో పరుగులు చేసి టీమిండియా టీ20 టీంలో పునరాగమనం చేశా. ఇప్పుడు మళ్లీ వెస్టిండీస్ టూర్‌లో నన్ను పక్కన పెట్టేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యా కానీ ఏం చేయలేం కదా. దీని కోసం ఎవరితో గొడవ పడలేను' అని షా అన్నాడు.
'నా గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ నేను ఎలాంటి వాడినో నా వాళ్లకు తెలుసు. నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఎక్కువ ఫ్రెండ్‌షిప్‌లు చెయ్యను కూడా. ఈ జనరేషన్‌లో ఇదే సమస్య. మన ఆలోచనలను ఎవరితో పంచుకోలేం. ఎవరితోనైనా చెప్తే తెల్లారే సోషల్ మీడియాలో వచ్చేస్తుందని భయమేస్తుంది. అందుకే కొత్త వాళ్లతో స్నేహం చెయ్యను. నాకున్న ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో కూడా అన్ని విషయాలు పంచుకోను' అని పృథ్వీ షా పేర్కొన్నాడు.