న్యూఢిల్లీ: మొన్నటి వరకు మైదానంలో తన బ్యాటుతో బౌలర్లకు చుక్కలు చూపిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ప్రస్తుతం వ్యాఖ్యాతగా మారి కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ సర్ డెన్నీస్ లిల్లీ పుట్టిన రోజు(జులై 18) సందర్భంగా సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు.
అందరిలా కాకుండా ఈ నవాబ్ ఆఫ్ నజఫ్‌గఢ్ తన దైన శైలిలో నవ్వులు పూయించే విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, తన జనరేషన్‌లో ఎంతో ప్రతిభగల బౌలర్‌గా పేరు తెచ్చుకున్న లిల్లీ.. ఈ జులై 18తో 67వ పడిలో అడుగుపెట్టాడు.
'పుట్టిన రోజు శుభాకాంక్షలు డెన్నీస్ లిల్లీ. ఒక వేళ లిల్లీ బాలీవుడ్ హిట్ సినిమా గుండాలో నటించినట్లయితే..'నా పేరు లిల్లీ, నా చేతి నుంచి వచ్చే బంతి బ్యాట్స్‌మన్ తలను బలంగా తాకుతూ దూసుకెళ్లేది' అని అనేవాడేమో' అని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.
హిందీ చిత్రాల్లో భయపట్టే విలన్‌లా మైదానంలో లిల్లీ ఉంటాడని సెహ్వాగ్ ఈ విధంగా పొల్చుకొచ్చాడన్నమాట. ఐసిసి కూడా లిల్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. గొప్ప బౌలర్ అంటూ కొనియాడింది.