
కరాచీ: పాకిస్థాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చైర్మన్‌గా మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ రమీజ్ రాజా సోమవారం ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరిగినట్లు పాక్ బోర్డు ఓ లేఖలో తెలిపింది. పీసీబీ 36వ చైర్మ్‌ను ఎన్నుకునేందుకు.. లాహోర్‌లోని నేషనల్ హై పర్ఫార్మెన్స్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌తో ప్రత్యేక మీటింగ్ జరిగింది. మాజీ జస్టిస్ షేక్ అజ్మత్ సయీద్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. బోర్డులో పార్టన్ ఇన్ చీఫ్ అయిన పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ నియకామంలో కీలక పాత్ర పోషించారు. రమీజ్ రాజాను చైర్మన్‌గా ఎన్నుకునేందుకు ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు. ఇటీవలే తాత్కాలిక కోచ్‌లుగా నియమితులైన సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లు కూడా ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టుకు గతంలో కెప్టెన్‌గా బాధ్యతలు అందించిన రమీజ్ రాజాకు పోటీగా ఎవరూ నిలువలేదు. దీంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రమీజ్ రాజా మూడేళ్ల పాటు చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు పీసీబీ చైర్మన్ స్థానంలో కొనసాగిన ఎహసాన్ మణి మూడేళ్ల పదవీ కాలం ఆగస్టు 25తో పూర్తయింది. దాంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఎహసాన్ మణి తన పదవి కాలంలో పీసీబీని సరైన మార్గంలోనే నడిపించారు. అయితే కోచ్‌ల విషయంలో మాత్రం ఆయన కాస్త అజాగ్రత్తగా వ్యవరించారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా తనను ఎన్నుకున్నందుకు రమీజ్ రాజా ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్‌లో పాజిటివ్ దృక్పథాన్ని నింపేందుకు ప్రయత్నిస్తానన్నారు. మైండ్‌సెట్‌ను, ప్రవర్తనా విధానంపై ఫోకస్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒకప్పటి మేటి జట్టుగా ఇప్పటి టీంను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తా అని రమీజ్ రాజా పేర్కొన్నారు. రాజా గతంలో 2003 నుంచి 2004 వరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన నాలుగో అంతర్జాతీయ క్రికెటర్ రమీజ్ రాజా. అబ్దుల్ హఫీజ్ కర్దార్ (1972-1977), జావేద్ బుర్కి (1994-1995) మరియు ఇజాజ్ బట్ (2008-2011) గతంలో బోర్డులో పనిచేశారు. రాజా పాక్ తరఫున 57 టెస్టులు, 198 వన్డేలు ఆడారు.
టీ20 ప్రపంచకప్ 2021కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. పాక్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌గా ఉన్న వకార్ యూనిస్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ వెల్లడించిన సరిగ్గా రెండు గంటల అనంతరం ఇద్దరు కోచ్‌లు రాజీమానా చేసి భారీ షాక్ ఇచ్చారు. ఇక న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను పీసీబీ నియమించింది. కొత్త చైర్మన్ రమీజ్ రాజా.. ఈ ఇదరినే కొనసాగిస్తారో లేదా మరొకరికి అవకాశం ఇస్తారో చూడాలి.
పాకిస్తాన్ టీ20 జట్టు ఇదే
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.