గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ శైలి మారింది. కేకేఆర్ ఆటలో దూకుడు పెరిగింది. తిరిగి ఓపెనర్ అవతారమెత్తిన సునీల్ నరైన్ సత్తాచాటుతున్నాడు. యువ ప్లేయర్లు రఘవంశీ, హర్షిత్ రాణా ఆకట్టుకుంటున్నారు. అంతేగాక కోల్‌కతా ఆల్‌రౌండ్ షోతో అలరిస్తూ పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచింది.
వీటన్నింటికీ గంభీర్ పరోక్షంగా ఓ కారణమయ్యాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ గంభీర్ బరిలోకి దించుతున్నాడు. అయితే జట్టుపై తన ప్రభావాన్ని చూపిస్తున గంభీర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయం సాధించడంతో తమ జట్టును కొనియాడాతూ పోస్ట్ చేశాడు. ''కోల్‌కతా స్టైల్‌లో విజయం. 'సాల్ట్' సరిపోయింది'' అని గంభీర్ ట్వీటాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపులో ఓపెనర్ సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో 68 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో సాల్ట్‌ను ప్రశంసిస్తూ గంభీర్ ట్వీట్ చేశాడు.
కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (35; 26 బంతుల్లో, 5x4, 1x6), రిషభ్ పంత్ (27; 20 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్లు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లుతో (3/16)తో సత్తాచాటాడు. హర్షిత్ రాణా (2/28), వైభవ్ అరోరా (2/29) చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు వచ్చిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో, 7x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (33*; 23 బంతుల్లో, 3x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (26*; 23 బంతుల్లో, 2x4, 1x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.