
హైదరాబాద్: సాధారణంగా ఒక్కోసారి అనుకోకుండానో... ఆవేశంలోనో బౌలర్ల శైలి మారుతుంటుంది. ఇలా చాలా సార్లు జరిగినప్పటికీ ఇటీవల వెస్టిండీస్ వేసిన బాల్ అత్యంత చెత్త బౌలింగ్ అని తిట్టిపోస్తున్నారు. కామెంటేటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం ఇదొక చెత్త బంతి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త డెలివరీ అనదగ్గ రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో చోటు చేసుకుంది.
ఎడమ చేతి వాటం బౌలర్ అయిన షెల్డన్.. బ్యాట్స్‌మెన్‌కు విసిరిన బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ కష్టంగా అందుకోవాల్సి వచ్చింది. ఇక కామెంటేటర్ల విషయానికొస్తే.. 'ఇవాళ నాకు మంచి రోజులా ఉంది. ఏ గాయం తగలకుండానే బయటపడగలిగాను' అని అన్నాడు. మరొక కామెంటేటర్ మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏ ప్రమాదమూ సంభవించలేదు' అని చెప్పుకొచ్చాడు.
ఇలా బంతిని విసరడం గతంలో ఎప్పుడూ చూడలేదంటూ ఓ కామెంటేటర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వికెట్లకు బోలెడంత దూరంగా వెళ్లిన ఈ బంతిని చూసిన అంపైర్ కష్టం మీద నవ్వు ఆపుకొని వైడ్‌గా ప్రకటించారు. 1980ల్లో బ్యాట్స్‌మెన్‌ను వణికించిన కరేబియన్ బౌలింగ్ విభాగం ఇలా తయారడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ సెంచరీ (103 పరుగులు) చేయడంతో బంగ్లాదేశ్ 301 పరుగులు చేసింది. క్రిస్ గేల్, ఈవెన్ లూయిస్ విండీస్‌కు చక్కటి ఆరంభం ఇచ్చినప్పటికీ నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 283 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2-1 తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌కు తొమ్మిదేళ్ల తర్వాత విదేశీ గడ్డ మీద ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం.