Champions Trophy 2025: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని విధాలా సిద్ధమైంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరంలో అడుగుపెట్టబోతోంది. ఈ సారి ఎలాగైనా ఛాంపియన్స్ గానే భారత్ లో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. వన్డే వరల్డ్ కప్ -2023లో ఫైనల్ వరకూ భారత్ ను తీసుకెళ్లిన రోహిత్ శర్మ.. అనంతరం తన కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దక్కించుకోవాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఈ ట్రోఫీలో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.
రోహిత్ కెప్టెన్సీ గురించి భారత మాజీ క్రీడాకారుడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో భారత్ విఫలమైనా రోహిత్ శర్మ కెప్టెన్సీకి వచ్చిన నష్టమేమీ లేదంటూ.. ఓ యూట్యూబ్ చిట్ చాట్ లో మహమ్మద్ కైఫ్ అన్నాడు. రోహిత్ శర్మ ఇంకా చాలా కాలం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతాడని చెప్పుకొచ్చాడు. 2027 వన్డే ప్రపంచ కప్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ ఆడనుందని మహమ్మద్ కైఫ్ చెప్పాడు. హిట్ మ్యాన్ రోహిత్ కెప్టెన్సీలో భారత్ కు 72.5 శాతం విజయాలు లభించాయని.. అందుకే ఇంకా మరింత కాలం రోహిత్ టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతాడని కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

క్రికెట్ లో విజయాలు సాధిస్తే పొగడ్తలు, ఓటమి పాలైతే విమర్శలు సాధారణమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని కామెంట్ల వర్షం కురిపించారు. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు కూడా రోహిత్ కు రిటైర్ అవాల్సిన సమయం వచ్చింది అనుకుంటా అని కామెంట్లు చేయడం గమనార్హం. రిటైర్మెంట్ విషయంలో వస్తున్న వార్తలపై రోహిత్ తన బ్యాటింగ్, కెప్టెన్సీతోనే సమాధానం ఇచ్చాడు.