న్యూఢిల్లీ: నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఫిరోజా షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాపై మ్యాచును గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గత మ్యాచులతో పోలిస్తే ఈ మ్యాచులో విజయం సాధించడానికి జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అన్నాడు.
దక్షిణాఫ్రికాపై నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 స్కోరుతో గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి, మూడో మ్యాచులను మొదటి మూడు రోజుల్లో గెలుచుకోగా, నాలుగో టెస్టు ఐదో రోజు వరకు సాగింది. మ్యాచులో చాలా వరకు దక్షిణాఫ్రికా భారత్‌ను ప్రతిఘటించింది. మ్యాచ్ అనంతరం సోమవారం కోహ్లీ మాట్లాడాడు.

అన్ని విజయాలు ప్రత్యేకమైనవేనని, అయితే వాటికన్నా ఎక్కువ విశిష్టమైందని, తాము ఎక్కువ కష్టపడాల్సి రావడం వల్ల అది చాలా ప్రత్యేకమైన విజయమని కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ను డ్రా చేయడానికి దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించిందని, చేతులెత్తేయాలని తాను బౌలర్లకు చెప్పానని, అయితే టీ బ్రేక్ తర్వాత పరిస్థితి మారిందని అన్నాడు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ప్రతిఘటిస్తున్న తీరుకు తాను ఆశ్చర్యపోయానని, బౌలర్లు సహనం కోల్పోలేదని, ప్రయత్నానికి నిజంగా వారు నిజంగా గర్వించాలని, క్రికెట్ అంటే అదేనని, అదే సహనమని, జట్టు ఎంత శక్తిని ధారపోస్తుందనే దానిపై అది ఆధారపడి ఉంటుందని, తాను ఒక్కడినే నిలబడి ఏమీ చేయలేనని, ప్రతిష్ట జట్టుకంతటికీ దక్కుతుందని అన్నాడు.

బౌలర్లకు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని, తమకు పేస్ చూపించగల బౌలర్లు ఉన్నారని, ఏ మైదానంలోనైనా వారికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యమని, సరైన సమయంలో వారి విశ్వాసాన్ని కలిగించడం ముఖ్యమని, వారు చేసిన దానికి మన ప్రతిస్పందన కూడా ఉండాలని అన్నాడు.
భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు మ్యాచును చూడడానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేక్షకులకు కృతజ్ఢతలు తెలుపుతున్నానని, క్రిక్కిరిసిన మైదానంలో ఆడడం అద్భుతంగా ఉంటుందని కోహ్లీ అన్నాడు.