INDvsAUS : టీమిండియాకు సవాల్‌గా మారిన కుల్దీప్.. ఆడించాలా? వద్దా?

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునేందుకు ఆస్ట్రేలియా, భారత్ పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. గురువారం మొదలయ్యే మొదటి టెస్టుతో ఈ రెండు జట్లు తమ పోటీకి శంఖం పూరించనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలా? వద్దా? అనే ప్రశ్న అందరి బుర్ర తినేస్తోంది. దీనిపై పలువురు నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కుల్దీప్ కీలకం ఎందుకంటే?
ఆస్ట్రేలియా జట్టులో ఎడం చేతి వాటం బ్యాటర్లు చాలా ఎక్కువ. వీరిని కట్టడి చేయడంతోపాటు ఇబ్బంది పెట్టి వికెట్లు తీసే సత్తా కుల్దీప్ సొంతం. ప్రస్తుతం ఆస్ట్రేలియాను చూస్తుంటే తొలి 8 మందిలో కనీసం ఆరుగురు ఎడం చేతి వాటం బ్యాటర్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సిరీస్‌లో అశ్విన్ చాలా కీలకం కానున్నాడు. అతనితోపాటు లెఫ్ట్ హ్యాండర్లకు దూరంగా బంతిని స్పిన్ చేస్తూ వికెట్లు తీయగలిగే బౌలర్ కుల్దీప్. కాబట్టి అతన్ని ఆడించడం వల్ల భారత బౌలింగ్ లైనప్ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్ డెప్త్ ఏది?
భారత్‌లో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలిస్తాయనే మాట వాస్తవమే. అయితే స్పిన్నర్ల నుంచి టీమిండియా కేవలం బౌలింగ్ మాత్రమో కోరుకోవడం లేదు. మంచి కంట్రోల్, బ్యాటింగ్ కూడా కావాలని అనుకుంటోంది. ప్రస్తుతం జట్టు వద్ద ఉన్న ఫింగర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురూ ఈ అంశాల్లో మేటిగా ఉన్నారు. జడేజా, అశ్విన్ ఇద్దరూ టెస్టుల్లో బెస్ట్ ఆల్‌రౌండర్లు కాగా.. అక్షర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరినీ తొలగించడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. కుల్దీప్ అంత గొప్ప బ్యాటర్ కాదు. కాబట్టి అతను జట్టులో స్థానం కోసం వేచిచూడక తప్పేలా లేదు.

ఎటాకింగ్ బౌలర్
రెండేళ్ల తర్వాత భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కుల్దీప్.. బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు తీసుకున్నాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న కుల్దీప్‌ను ఆస్ట్రేలియాపై ఆడించడం మంచిదని కొందరు మాజీలు అంటున్నారు. కుల్దీప్ వేసే ప్రతి ఓవర్‌లోనూ వికెట్ పడేలా కనిపిస్తోందని, ఇంత అద్భుతమైన ఎటాకింగ్ బౌలింగ్ ఇంత వరకు చూడలేదని పలువురు ఇప్పటికే అతనికి కితాబిచ్చారు కూడా. వార్నర్, ట్రావిస్ హెడ్ వంటి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగుతారు. అలాంటి వారిని బోల్తా కొట్టించాలంటే కుల్దీప్ వంటి తెలివైన, ఎటాకింగ్ బౌలర్ అవసరం జట్టుకు చాలా ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications