
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రమాదకర కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. భారత్‌లో మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించడంతో.. టోర్నీ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కరోనా కారణంగా ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌పై కూడా సందిగ్ధత నెలకొంది. ఆస్ట్రేలియా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ సరిహద్దులను ఆరు నెలలపాటు (సెప్టెంబర్ 30 వరకూ) మూసివేసింది. దీంతో అక్కడ మెగా టోర్నీ జరగడం అనుమానంగానే మారింది. దీనిపై టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ గురించి ఎటువంటి కామెంట్ చేయలేమన్నారు.
'ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరుగుతుందో లేదో మనం ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్థితుల్లో మళ్లీ క్రికెట్ ఎప్పుడు ఆరంభం అవుతుందో కూడా చెప్పే అవకాశం లేదు' అని ఫస్ట్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి అన్నారు. క్రీడలు ప్రజలకు వినోదాన్ని పంచిపెడతాయని చెప్పిన ఆయన.. ప్రస్తుతం అందరిని ఇళ్లకు పరిమితం అయ్యేలా చేసిన కోవిడ్-19ను సమర్థవంతంగా తరిమికొట్టాలన్నారు. అలా చేస్తేనే భవిష్యుత్తు సంతోషంగా ఉంటుందని, అందుకోసం అందరు కృషి చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రి స్పష్టం చేశారు.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గితే సెప్టెంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరిగే అవకాశం అధికంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. అలాగే అక్టోబర్ నుంచి జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణను ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు మార్చవచ్చని సూచించారు. సన్నీ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ... 'సెప్టెంబర్ 30వరకు వేరే దేశాల నుంచి ఎవరూ రాకుండా ఆస్ట్రేలియా నిషేధం విధించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడో వారం నుంచి టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆంక్షల వల్ల అది చాలా కష్టం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు భారత్, ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకోవాలి. ఒకవేళ భారత్‌లో కరోనా ప్రభావం తగ్గితే.. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ ఇక్కడ నిర్వహించాలి. వచ్చే ఏడాది భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియాకు బదిలీ చేయాలి. అలా అయితే ఈ ఏడాది విశ్వకప్ జరిగే అవకాశం ఉంటుంది' అని అన్నారు.