న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో తమ పదవీకాలం పొడిగించుకోవాలని ఆశిస్తున్న ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా భవితవ్యం వచ్చే వారం తేలనుంది. లోధా కమిటీ సిఫార్సు చేసిన 'కూలింగ్ ఆఫ్'క్లాజ్‌లో మార్పులకు అనుమతించాలని బోర్డు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ నెల 9వ తేదీన తుది విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని తమ జాబితాలో చేర్చింది.
దాదా, జైషా బీసీసీఐ, స్టేట్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లుగా తమ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మేలో షా, జూన్‌లో గంగూలీ టర్మ్ ముగిసినప్పటికీ ఇంకా తమ పదవుల్లో కొనసాగుతున్నారు. బోర్డు ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం వాళ్లిద్దరూ మూడేళ్ల విరామం(కూలింగ్ ఆఫ్) తీసుకోవాల్సి ఉంది. అయితే బోర్డు రాజ్యాంగంలో అరడజను మార్పులు చేయాడానికి అనుమతించాలని కోరుతూ ట్రెజరర్ అరుణ్ ధూమల్ ఈ ఏడాది ఏప్రిల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
బీసీసీఐ, స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్ల టర్మ్ పూర్తి చేసిన ఆఫీస్ బేరర్లకు వర్తించే కూలింగ్ ఆఫ్ క్లాజ్‌ను సవరించడం అందులో ప్రధానమైనది. కానీ, కరోనా కారణంగా ఈ పిటిషన్‌పై విచారణ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు వచ్చే బుధవారం దీనిపై తుది విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు బెంచ్ నిర్ణయించింది. అదే రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది.