
విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ
టీమిండియా కెప్టెన్ హోదాలో ఉన్న సమయంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని పట్టుబట్టాయి. అదే సమయంలో పెద్ద మొత్తంలో మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీకి బడా కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లను కాదనకుండా ఇట్టే ఒడిసి పట్టుకుని బాగానే సంపాదించాడు.
కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారవుతోందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ దిగిపోయాక.. ఇప్పుడు రోహిత్ శర్మకు ఆ కంపెనీలు క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా విరాట్ కోహ్లీ మైదానంలో చాలా చురుగ్గా ఉంటాడు. అంతేకాదు చాలా దూకుడుగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఇదే దూకుడు అభిమానుల్లో అతనికి మంచి క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఈ దూకుడే అతని బ్రాండ్ వాల్యూను కూడా అమాంతంగా పెంచేసింది. కానీ రోహిత్ శర్మ విషయంలో మాత్రం ఈ దూకుడు కనిపించదు.

రోహిత్ శర్మ రీప్లేస్ చేస్తాడా
రోహిత్ శర్మ కాస్త కూల్‌గా కనిపిస్తాడు. అంతేకాదు మైదానంలో చురుగ్గా ఉన్నప్పటికీ అగ్రెసివ్ నేచర్ మాత్రం అతనిలో కనిపించదు. కానీ ఇద్దరూ అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమకు అప్పజెప్పిన బాధ్యతలను మాత్రం సమర్థవంతంగా వారి వారి స్టయిల్‌లో నిర్వర్తించారు. అయితే బ్రాండ్ విషయానికొస్తే మాత్రం విరాట్‌దే పై చేయిగా ఉంది. ఓ అంతర్జాతీయ సంస్థ బ్రాండ్ వాల్యుయేషన్ ప్రకారం అధిక సంపాదన కలిగి ఉన్న ఇండియన్ సెలబ్రిటీస్‌లో విరాట్ కూడా ఒకరుగా ఉన్నాడు. ఇతని బ్రాండ్ వాల్యూ 237.7 మిలియన్ డాలర్లు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 17వ స్థానంలో ఉన్నాడు.
ఇప్పుడు రోహిత్ శర్మ భారత్ వన్డే మరియు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినందున బ్రాండ్ వాల్యూ ప్రకారంగా కాస్త పైకి ఎగబాకే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక రోహిత్ శర్మ ఎండోర్స్‌మెంట్ ఫీజు ప్రస్తుతం ఉన్నదానికంటే 50శాతం నుంచి 80శాతంకు ఎగబాకే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒక్క రోజు షూటింగులో పాల్గొనాలన్నా.. లేదంటే ఒక యాడ్ కోసం రోహిత్ శర్మ రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. కోహ్లీది మాత్రం దీనికి 4 రెట్లు ఉంటుంది.

ఎవరు ఏ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా... విరాట్ లేదా ధోనీలాంటి ప్లేయర్ల బ్రాండ్ వాల్యూను అందుకోవడం సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆడిడాస్, ఇన్ఫినిటీ లెర్న్, టాగ్, ఓక్లే, గ్లెన్‌మార్క్ ఫార్మా, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, వెగా, డాక్టర్ ట్రస్ట్, సియాట్‌తో పాటు మరికొన్నిటికి బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ ఉండగా... పూమా, ఆడి, ఎంఆర్ఎఫ్, ఎంపీఎల్, ఫిలిప్స్, మింత్రా, టిస్సాట్, టూ యమ్, గ్రేట్ లెర్నింగ్‌తో పాటు మరికొన్ని బ్రాండ్లకు విరాట్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
ఒక వేళ రోహిత్ శర్మ కోసం పలు సంస్థలు ఎదురుచూస్తున్నట్లయితే బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు, ఆ తర్వాత 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు.

నిపుణులు ఏం చెబుతున్నారు
ఇక రోహిత్ శర్మ రేసులోకి వస్తే క్రమంగా విరాట్ బ్రాండ్ పడిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ధోనీ విషయంలో మాత్రం అలా అవలేదనే అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ధోనీ రిటైర్ అయ్యాక కూడా తన బ్రాండ్ చెక్కు చెదరలేదని ఇందుకు కారణం ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనక ఇవ్వకపోతే జట్టులో కొనసాగడం కూడా అనుమానంగానే ఉందని మరో వెర్షన్ వినిపిస్తోంది.
అందుకే వచ్చే ఏడాది మొత్తం విరాట్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన ఇచ్చి బ్రాండ్ వాల్యూను నిలుపుకుంటాడా లేక ఆ ప్లేస్‌ను రోహిత్ శర్మ భర్తీ చేస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.


Click it and Unblock the Notifications












