
కివీస్‌కే ఎక్కువ అవకాశం:
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. పాక్ ఆడిన నాలుగు మ్యాచుల్లో నాలుగింటిని గెలిచి 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ జట్లు చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సెమీస్ చేరే అవకాశం కివీస్‌కే మెండుగా ఉంది. న్యూజిలాండ్ తన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే.. మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా కివీస్ నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.

అఫ్గానిస్థాన్ గెలిస్తే:
ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలిస్తే.. న్యూజిలాండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్ కంటే అఫ్గాన్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. అయితే అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మాత్రం టీమిండియాపై ఆధారపడివుంటాయి. సూపర్-12లో ఆఖరి మ్యాచ్‌లో నమీబియాతో సోమవారం (నవంబర్ 8) భారత్ తలపడనుంది. కివీస్‌ను అఫ్గాన్ ఓడించినా.. ఆ జట్టు రన్‌రేట్ పెద్దగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కివీస్ లాంటి పెద్ద జట్టుపై భారీ విజయం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే అఫ్గాన్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్.. నమీబియాతో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానులు కోరుకునేది ఒక్కటే.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ గెలవాలని.
బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్తాం:
స్కాట్లాండ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' రవీంద్ర జడేజా మాట్లాడాడు. ఆ సమయంలో ఒక విలేకరి న్యూజిల్యాండ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోతే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు. 'అదే జరిగితే.. చేసేదేముంటుంది. మేము బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్తాం' అని నవ్వుతూ టక్కున సమాధానం ఇచ్చాడు. జడేజా ఇచ్చిన సూటి సమాధానానికి సదరు విలేకరి కూడా నవ్వులు పూయించాడు. స్కాట్లాండ్‌పై భారీ విజయంతో టీమిండియా రన్‌రేట్ బాగా మెరుగైంది. అఫ్గానిస్థాన్ గనుక కివీస్‌ను ఓడిస్తే.. ఆ తర్వాత నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధిస్తే.. భారత జట్టు సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. అయితే కేవలం పాక్ చేతిలోనే ఓడిన కివీస్‌పై నబీ సేన గెలుస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.

మరో మ్యాచ్ మాత్రమే ఉంది:
అనంతరం టీమిండియా విజయంపై రవీంద్ర జడేజా మాట్లాడాడు. 'మేం మంచి క్రికెట్ ఆడాలని చూస్తున్నాం. మేము భారీ తేడాతో గెలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఇందుకోసం మా వంతు కృషి చేస్తున్నాం. జట్టు మొత్తం 100 శాతం మైదానంలో ఆడుతోంది. మేమంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇక మాకు టోర్నీలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో కూడా భారీ విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే ఆడితే ఏ జట్టు కూడా ఓడించదు' అని జడేజా పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












