
ఇస్లామాబాద్: చాలాకాలంగా టీమిండియా పర్యటన చేపట్టని దేశమంటూ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఒక్కటే. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దీనికి ప్రధాన కారణం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తరచూ చేస్తోన్న దాడులను దృష్టిలో ఉంచుకుని భారత్.. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. 2013 తరువాత ఒక్క సిరీస్ కూడా ఈ రెండు దేశాల మధ్య చోటు చేసుకోలేదు.
ఇందులో క్రికెట్ ఒకటి. ప్రపంచకప్, ఆసియా కప్ వంటి టోర్నమెంట్లు మినహా.. మనదేశ క్రికెట్ జట్టు పాక్ పర్యటనకు వెల్లడం గానీ, ఆ దేశం మన గడ్డ మీదికి రావటం గానీ స్తంభించిపోయింది. ఇదివరకు షార్జా వంటి తటస్థ వేదికలపై మ్యాచ్‌లను నిర్వహించే వారు. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం కూడా ఇప్పట్లో కనిపించట్లేదు. భారత్-పాక్ పరస్పరం క్రీడాపరమైన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.
ఇదలావుంచితే- ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసాన్ మణి ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని తామేమీ భారత్‌ను అడుక్కోవట్లేదని చెప్పారు. ఒక్క భారత్‌తో మాత్రమే కాదని, తమతో క్రికెట్ ఆడాలని తాము ఏ దేశం ముందూ బిచ్చమెత్తుకోవట్లేదని అన్నారు. ఆయా దేశాలే హుందాగా ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ముందుకు రావాలని చెప్పారు.
ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో భారత టీమ్ తమ దేశ జట్టుతో ఆడటం ఖాయమని ఎహసాన్ మణి ధృవీకరించారు. ఈ మ్యాచ్‌తో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించుకోవడానికి గల అవకాశాలు ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తమ దేశ జట్టు శ్రీలంకతో రెండు టెస్ట్‌మ్యాచ్‌లను ఆడబోతోందని అన్నారు.
ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా ఈ రెండు మ్యాచ్‌లు జరగొచ్చని చెప్పారు. ఈ మ్యాచ్ అనంతరం పాక్ జట్టు అక్టోబర్-నవంబర్‌లల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుందని, అక్కడ రెండు టెస్ట్‌మ్యాచ్‌లను అడుతుందని అన్నారు. అందులో ఒకటి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఉంటుందని అన్నారు. శ్రీలంకతో తామ ద్వైపాక్షిక సిరీస్‌ను కొనసాగిస్తున్నామని, ఇటీవలే ఆ దేశ జట్టు పాక్‌లో పర్యటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.