టీమిండియా అదరగొట్టింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుని 1-1తో సిరీస్‌ను రోహిత్‌సేన సమం చేసింది. అయితే భారత్ విజయం సాధించనప్పటికీ జట్టులో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. అంతేగాక మంచి ప్రారంభం దక్కినప్పటికీ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ గురించి కూడా మాట్లాడాడు.
అయితే ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన కేఎస్ భరత్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. తన సొంతగడ్డపై జరిగిన వైజాగ్ టెస్టులో అయినా మెరుస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. ఇక వికెట్ కీపర్‌గా అతడిపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యర్థిని ఔట్ చేసే అవకాశాన్ని కొన్నిసార్లు మిస్ చేయగా, మరికొన్నిసార్లు అద్భుతంగా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయని క్రికెట్ విశ్లేషికులు భావిస్తున్నారు.

కానీ కేఎస్ భరత్‌కు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతు ఇచ్చాడు. యువ ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని బట్టి కాస్త నిలకడగా ఎదుగుతారని, వైజాగ్ టెస్టులో భరత్ వికెట్ల వెనుక మంచి ప్రదర్శన చేశాడని ద్రవిడ్ అన్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ద్రవిడ్ పరోక్షంగా వెల్లడించాడు. ఇషాన్‌తో టచ్‌లోనే ఉన్నామని చెప్పాడు.
''ప్రతి ఒక్కరికి ఓ మార్గం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ గురించి ఎక్కువగా మాట్లాడలేను. అతడు విరామం తీసుకున్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడి తిరిగి రావాలి. ఛాయిస్ అతడి చేతుల్లో ఉంది. మేం ఇషాన్‌తో టచ్‌లోనే ఉన్నాం'' అని ద్రవిడ్ అన్నాడు. గిల్ గురించి మాట్లాడుతూ.. జట్టు స్థానంలో గిల్‌పై ఒత్తిడిలేదని, బయటనుంచి మాత్రమే ఉందని ద్రవిడ్ పేర్కొన్నాడు. అతడి తిరిగి ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని, మూడు ఫార్మాట్లలో గిల్ పరిపూర్ణ ఆటగాడని చెప్పాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టులకు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.