
శ్రీలంక మెరుగైన రికార్డు
ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటి వరకు 21 అంతర్జాతీయ వన్డే మ్యాచులు జరిగాయి. వీటిలో భారత జట్టు 12 మ్యాచుల్లో గెలిచి, ఎనిమిదింట ఓటమిపాలైంది. 2017లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ గణాంకాలు చూస్తూ ఇక్కడ భారత్‌కు మెరుగైన రికార్డే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ మైదానంలో శ్రీలంకకు మరింత కలిసి రావడం గమనార్హం. ఇక్కడ లంకేయులు మొత్తం నాలుగు మ్యాచులు ఆడగా.. వాటిలో మూడింట శ్రీలంకనే విజయం వరించింది. ఈ లెక్కన భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం అంత సులభంగా కనిపించడం లేదు.

చివరగా జరిగిన మ్యాచ్
కోల్‌కతాలో చివరి సారి భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. 2017 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. ఆ సిరీస్‌లో భారత జట్టు 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే మిడిలార్డర్‌లో కోహ్లీ తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో టీమిండియా కేవలం 253 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో మార్కస్ స్టొయినిస్ (62), స్టీవెన్ స్మిత్ (59) ఇద్దరూ ఆస్ట్రేలియాను గెలిపించినంత పని చేశారు. అయితే భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివర్లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.

రాణించిన కోహ్లీ..
ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (55)తో కలిసి జట్టుకు మెరుగైన స్కోరు అందించేందుకు ప్రయత్నించాడు. వీళ్లిద్దరూ కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రహానే అవుటైన తర్వాత కోహ్లీకి పెద్దగా సహకారం లభించలేదు. ఈ క్రమంలోనే అతను కూడా 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. మరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అప్పుడు మిస్ చేసుకున్న ఛాన్స్‌ను అందిపుచ్చుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications












