IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించడమే కాకుండా.. వారిని బహిరంగంగా అవమానించింది. ఈ మ్యాచ్‌లో టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంపై దుమారం చెలరేగుతోంది. ఈ మొత్తం ఘటనపై పాకిస్థాన్ జట్టు ఐసీసీలో అధికారిక ఫిర్యాదు చేసింది.
వివాదం నేపథ్యం ఇదే..
ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న (ఆదివారం) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఓ వివాదం మొదలైంది. టీమిండియా కెప్టెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించిన తర్వాత.. ఆయన శివం దూబేతో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. అయితే భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లు చేతులు కలపడానికి ముందుకు రాలేదు. పాకిస్థాన్ జట్టు, సహాయక సిబ్బంది కొంత సేపు వేచి ఉన్నప్పటికీ.. భారత జట్టు మైదానం నుంచి నేరుగా తమ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి తలుపులు మూసుకుంది.

పాకిస్థాన్ ఫిర్యాదు
భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ జట్టు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురైంది. పాకిస్థాన్ జట్టు మేనేజర్ నవీద్ అఖ్తర్ చీమా టీమిండియా ప్రవర్తనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పైనా నిరసన వ్యక్తం చేశారు. టాస్ సమయంలో కెప్టెన్లు కరచాలనం చేసుకోవద్దని రిఫరీ సూచించారని చీమా ఆరోపించారు.
టీమిండియా కెప్టెన్ స్పందన
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్పందించారు. భారత జట్టు కేవలం ఆడటానికి మాత్రమే మైదానంలోకి రాలేదని.. దీని వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారి కుటుంబాలకు తాము అండగా ఉన్నామని.. ఈ విజయాన్ని ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నామని తెలిపారు. ఆటగాళ్ల భావోద్వేగాల కంటే కొన్ని విషయాలు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.
ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నియమాల ప్రకారం.. మ్యాచ్ తర్వాత కరచాలనం తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ఆటగాళ్లపై హెచ్చరికలు, జరిమానాలు లేదా నిషేధాలు విధించడం అంత సులభం కాదు. ఇది క్రీడా స్ఫూర్తిలో భాగం మాత్రమే. అయితే ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కరచాలనం చేయకపోతే.. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పరిగణించబడుతుంది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.1.8 ప్రకారం, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన లేదా ఆట గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను లెవల్-1, లెవల్-2 నేరంగా వర్గీకరించవచ్చు.
*లెవల్-1 నేరం: దీనికి హెచ్చరిక లేదా గరిష్టంగా 2,000 డాలర్ల జరిమానా విధించవచ్చు.
*లెవల్-2 నేరం: దీనికి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా లేదా డీమెరిట్ పాయింట్లు ఇవ్వవచ్చు. ఒక ఆటగాడి ఖాతాలో 24 నెలల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు నమోదైతే కొన్ని మ్యాచ్‌ల నిషేధం కూడా విధించవచ్చు. ఈ సంఘటనపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.