ముంబై: బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చెల్లుబాటు అవుతుందా, లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోధా కమిటీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విస్మరించి సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
దానివల్ల బోర్డు బుధవారంనాడు కొత్తగా నియమించిన సీనియర్ టీమ్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. సీనియర్ సెలక్షన్ కమిటీలో ముగ్గురే ఉండాలని, జోన్ల వారీ ఎంపిక వద్దని, అందరికీ టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసింది.
అయితే, బోర్డు వాటిని పక్కనపెట్టి తమ పాత పద్ధతిలోనే కమిటీని నియమించింది. కమిటీలో ఐదుగురిని నియమించింది. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరూ ఒక్కో జోన్‌కు చెందినవాళ్లు. ఇక కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కేవలం ఆరు టెస్టులే ఆడాడు.

కమిటీలోని ఇద్దరు సభ్యులు జతిన్ పరాంజపే, గగన్ ఖోడా అసలు టెస్టులే ఆడలేదు. సెలక్షన్ కమిటీ సభ్యులంతా కలిసి ఆడిన టెస్టులు కేవలం 13 మాత్రమే. లోధా కమిటీ సిఫారసులను పక్కనపెట్టి సెలక్షన్ కమిటీని బోర్డు ఎలా నియమించిందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అయితే బోర్డు మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.
ఎప్పుడూ లేని విధంగా తొలిసారి సెలక్షన్ కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించి, ఇంటర్వ్యూలు కూడా జరిపామని బీసీసీఐ చెప్పింది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో గడిచిన ఏడాదికి సంబంధించిన విషయాలనే చర్చించాలి తప్ప భవిష్యత్తుకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని లోధా పానెల్ చెప్పింది.
దాన్ని కూడా బోర్డు పట్టించుకోలేదు. అందువల్ల బోర్డు నియమించిన ఈ కొత్త సెలక్షన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.