పేలవ ఫామ్‌తో భారత జట్టులో స్థానం కోల్పోయి, దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పునరాగమనం చేసి, అనూహ్యంగా టెస్టుల్లో వైస్ కెప్టెన్ పదవి అందుకున్న ప్లేయర్ అజింక్య రహానే. అతనికి ఇలా వైస్ కెప్టెన్ పదవి ఇవ్వడంపై పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రహానే ఆడిన రెండు ఇన్నింగ్స్‌లను అందరూ మెచ్చుకున్నారు కూడా.
ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తింది. ఐపీఎల్ 2023లో కూడా అజింక్య రహానే చెలరేగాడు. అలాంటి బ్యాటర్‌కు వన్డేలు, టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వాలని కొందరు అంటున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న రహానేకు ఈ అవకాశం ఇస్తే.. తన సీనియారిటీతో అద్భుతంగా రాణిస్తాడని వాళ్లు వాదిస్తున్నారు. అయితే ఇది అంత మంచి ఆలోచన కాదని టీమిండియా మాజీ ప్లేయర్, ప్రముఖ అనలిస్ట్ ఆకాష్ చోప్రా అన్నాడు.

'ఇది చాలా మంచి ప్రశ్న. కానీ అది జరగదు.. జరగకూడదు కూడా. ఇటీవలే గంగూలీ కూడా రహానేకు వైస్ కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించాడు. నేను కూడా దాని గురించి ఒక వీడియో పోస్టు చేశా. రహానే మీద నాకేం కోపం లేదు. కానీ అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం మెంటాలిటీని కొంచెం చూపిస్తుంది. కానీ టీ20లు, వన్డేల్లో మాత్రం బస్ ఎప్పుడో వెళ్లిపోయిందని నా అభిప్రాయం' అని చోప్రా వివరించాడు.

అలాగే ఐపీఎల్‌లో రహానే బాగా ఆడిన మ్యాచులను కూడా గుర్తుచేశాడు. 'మంచి బ్యాటింగ్ సర్‌ఫేస్‌పై.. అది కూడా పవర్‌ప్లేలో మాత్రమే రహానే అద్భుతంగా ఆడాడు. మిగతా చోట్ల అతని ఆట అంత గొప్పగా లేదు' అని చోప్రా చెప్పాడు. రహానే తన కెరీర్‌లో 110 వైట్ బాల్ మ్యాచులు ఆడాడు. వీటిలో 3337 పరుగులు చేశాడు. చివరగా 2018 ఫిబ్రవరిలో టీమిండియా తరఫున వైట్ బాల్ క్రికెట్ ఆడిన అతను.. మళ్లీ పునరాగమనం చేయడం జరిగే పనిలా లేదు.