
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ భారత జట్టుకు దూరమై చాలా కాలం అయిపోయింది. భారత జట్టు తరఫున కార్తీక్ చివరగా 2019లో ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ మళ్లీ టీమిండియాలోకి తిరిగి రాలేకపోతున్నాడు. అందుకు కారణం ప్రస్తుతం టీమిండియాలో రిషబ్ పంత్ రూపంలో బలమైన వికెట్ కీపర్ ఉండడమే. దీనికి తోడు పంత్ బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌లో పంత్‌కు రిజర్వ్‌గా వృద్ధిమాన్ సాహా ఉన్నాడు. దీంతో దినేశ్ కార్తీక్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడమే మానేశారు. దేశవాళ్లీ లీగ్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ జట్టులోకి రాలేకపోతున్నాడు. దీనికి తోడు అతని వయస్సు ఎక్కువగా కావడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చు. ప్రస్తుతం కార్తీక్ వయసు 36 ఏళ్లు.
తాజాగా ఓ జాతీయ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో 36 ఏళ్ల దినేశ్ కార్తీక్ టీమిండియాలోకి తన రీఎంట్రీ గురించి మాట్లాడాడు. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. తాను మళ్లీ భారత జట్టు తరఫున ఆడాలనుకుంటున్నానని, దాని కోసం తనకు సాధ్యమైనదంతా చేస్తానని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం భారత జట్టులో స్థానం సంపాదించడమేనని, అందుకు ఇప్పటికే తగిన సాధన చేస్తున్నట్టు కార్తీక్ చెప్పాడు. అలాగే మరో మూడేళ్లపాటు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. తాను ఎల్లప్పుడూ ఆటను ఆస్వాదిస్తుంటానని చెప్పాడు. తనకు టీ20 ఫార్మాంట్ అంటే ఇష్టమని, ఆ ఫార్మాట్‌లో టీమిండియాకు ఆడే సత్తా తనలో ఉందని కార్తీక్ తెలిపాడు. గత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో ఫినిషర్ లేని లోటు కనిపించిందని చెప్పాడు. ప్రస్తుతం తాను ఆ పాత్రపై దృష్టి పెట్టినట్లు దినేశ్ కార్తీక్ తెలిపాడు.
ఐపీఎల్‌లో గత ఏడాది దినేశ్ కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఈ సారి కోల్‌కతా రిటెన్షన్ జాబితాలో కార్తీక్‌కు చోటు దక్కలేదు. దీంతో అతను ఈ సారి వేలానికి రానున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 25 సగటుతో 1025 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 129 పరుగులు. ఇక 94 వన్డేల్లో 30 సగటుతో 1752 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 79 పరుగులు. ఇక 32 టీ20 మ్యాచ్‌ల్లో 33 సగటుతో 399 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌లు ఆడి 25 సగటుతో 4,046 పరుగులు చేశాడు. ఇందులో 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 97 పరుగులు.