Wiaan Mulder: జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రియాన్ లారా అజేయ 400 పరుగుల చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టే అవకాశం వియాన్ ముల్డర్‌కు లభించింది. అయితే వియాన్ ముల్డర్ అలా చేయకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఇప్పుడు దాని వెనుక గల కారణాన్ని స్వయంగా వెల్లడించాడు.
చారిత్రాత్మక రికార్డును లారా పేరున ఉంచాలనుకున్న ముల్డర్
దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ ఇటీవల జింబాబ్వేపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 367 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దిగ్గజ బ్రియాన్ లారా 400 పరుగుల చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముల్డర్ ఎందుకు అలా చేశాడని చాలా మందికి సందేహం కలిగింది. ఇప్పుడు వియాన్ ముల్డర్ స్వయంగా అసలు కారణాన్ని వివరించాడు.

బ్రియాన్ లారా ఏప్రిల్‌లో 2004లో ఇంగ్లాండ్ జట్టుపై అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అజేయంగా 400 పరుగులు చేశాడు. ఇది గత 21 సంవత్సరాలుగా టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుగా ఉంది. జింబాబ్వేపై వియాన్ ముల్డర్ మరో 33 పరుగులు చేసి ఉంటే అతను బ్రియాన్ లారా 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించి ఉండేవాడు. అయితే చరిత్ర సృష్టించకూడదని తీసుకున్న తన నిర్ణయానికి కారణాన్ని వియాన్ ముల్డర్ ఇప్పుడు వివరించాడు.
పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో వియాన్ ముల్డర్ మాట్లాడుతూ.. "బ్రియాన్ లారా ఓ దిగ్గటం.. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. నాకు మరోసారి అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. మేము రెండో బంతి నుంచే తగినన్ని పరుగులు చేశామని నేను భావిస్తున్నాను. నేను షుక్రీ కాన్రాడ్‌తో (దక్షిణాఫ్రికా కోచ్) మాట్లాడాను, ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలిచేందుకు సరిపడా స్కోరు చేశామని భావించాను. ఈ రెండు కారణాల వల్ల ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాను." అని వియాన్ ముల్డర్ చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాకు 405 పరుగుల ఆధిక్యం
వయాన్ ముల్డర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 626 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో-ఆన్ కారణంగా వారు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చారు. ప్రస్తుతం జింబాబ్వే 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 405 పరుగుల ఆధిక్యం ఉంది. జింబాబ్వేకు పరిస్థితి కష్టంగా మారింది. అయితే దక్షిణాఫ్రికా ప్రత్యర్థిని వీలైనంత త్వరగా కట్టడి చేసి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.