
తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా:
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదింది ముగ్గురు మాత్రమే. 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. గిబ్స్ విధ్వంసానికి డాన్ వాన్ బంగే బలయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. అనంతరం ఇప్పుడు కీరన్ పోలార్డ్ ఆరు సిక్సర్లు బాదాడు. టీ20లో ఆరు సిక్సులు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు.

ఆకట్టుకున్న డిక్వెల్లా, నిశాంక:
తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఆ లంక ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా (33: 29 బంతుల్లో 3x4, 1x6), పతుమ్ నిశాంక (39: 34 బంతుల్లో 4x4, 1x6) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. లంక స్టార్ బ్యాట్స్‌మన్ గుణతిలక (4), చండిమాల్ (11), మాథ్యూస్ (5), పెరీరా (1) పూర్తిగా విగలమయ్యారు. ఆరుగురు విండీస్ బౌలర్లు బౌలింగ్ చేయగా.. అందరూ ఒక వికెట్‌ని ఖాతాలో వేసుకున్నారు. ఓబేడ్ మెక్కాయ్ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు.

ధనంజయ హ్యాట్రిక్:
లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి ఓపెనర్లు సిమన్స్ (26: 15 బంతుల్లో 3x4, 2x6), ఎవిన్ లెవిస్ (28: 10 బంతుల్లో 2x4, 3x6) మెరుపు ఆరంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన స్పిన్నర్ అఖిల ధనంజయ హ్యాట్రిక్ తీశాడు. లెవిస్, క్రిస్ గేల్ (0), నికోలస్ పూరన్ (0)లను ఔట్ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధనంజయ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదేశాడు. దీంతో విండీస్ లక్ష్యం దిశగా సాగింది. పొలార్డ్ చివరకు 11 బంతుల్లో 38 రన్స్ చేశాడు. దీంతో వెస్టిండీస్ కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిందించి. పొలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.
అభిమానులకు వందనం చేసి:
ధనంజయ వేసిన ఆరో ఓవర్‌లో తొలి బంతిని పొలార్డ్ లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. రెండో బంతిని సైట్ నేరుగా స్క్రీన్‌ని తాకేలా హిట్ చేశాడు. మూడో బంతిని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా పొలార్డ్ సిక్స్‌గా బాదేశాడు. అప్పుడు కామెంటేటర్లకు ఊపొచ్చి యువీని గుర్తుచేశారు. ఆడే సమయంలో ధనంజయపై ఒత్తిడి పెరిగింది. ధనంజయ ఐదో బంతిని ఫుల్‌టాస్ వేయగా.. అతడి తలపై నుంచి పొలార్డ్ సిక్స్ బాదాడు. చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. పొలార్డ్ అభిమానులకు వందనం చేసి.. క్రీజులో ఉన్న జాసన్ హోల్డర్‌ను హత్తుకున్నాడు.


Click it and Unblock the Notifications












