పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్ట్ లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 120 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టెస్ట్ సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. గత 35 ఏళ్లలో పాక్ గడ్డపై వెస్టిండీస్ ఓ టెస్ట్ మ్యాచ్ లో గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో చివరిసారిగా 1990 నవంబర్ లో వెస్టిండీస్.. పాక్ గడ్డపై విజయం సాధించింది.
255 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్.. 133 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు జోమెల్ వార్రికన్ (5/27), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుడకేశ్ మోటీ (2/35) చెలరేగి ఆడటంతో పాకిస్థాన్ కుప్పకూలిపోయింది.ఓవర్ నైట్ స్కోర్ 4/76తో మూడో రోజు ఆట ప్రారంభించిన పాక్.. తొలి సెషన్‌లోనే మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. దీంతో మ్యాచ్ కొద్ది నిమిషాల్లోనే ముగిసింది.

పాకిస్థాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (31) టాప్ స్కోరర్. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) నిరాశపరిచారు. తకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు తీయగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. పాకిస్థాన్ 154 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ నౌమన్ అలీ 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు తీశాడు. మొత్తం మ్యాచ్ లో పేసర్లకు నాలుగు వికెట్లు మాత్రమే దక్కగా.. మిగతా 36 వికెట్లను స్పిన్నర్లే తీశారు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో కలిపి 19 వికెట్లు తీసిన వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.