
కింగ్‌స్టన్ (జమైకా): పటిష్ట పాకిస్తాన్‌పై తొలి టెస్టులో వెస్టిండీస్ ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకూ ఆసక్తికరంగా సాగగా.. విండీస్ ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాక్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడినప్పటికీ.. బౌలర్ కీమర్ రోచ్ (30; 52 బంతుల్లో 2x4) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ఆరంభం కానుంది.
ఓవర్‌నైట్ స్కోరు 160/5తో నాలుగో రోజైన ఆదివారం ఆటను కొనసాగించిన పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఇమ్రాన్ బట్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ అబిద్ అలీ (34) రాణించాడు. స్టార్ బ్యాట్స్‌మన్ అజర్ అలీ (23) విఫలమవగా.. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొహ్మద్ రిజ్వాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (20), అసన్ అలీ (28) పరుగులు చేశారు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో విండీస్ తరఫున 5 వికెట్ల ఫీట్ సాధించి పిన్న వయసు బౌలర్‌గా 19 ఏళ్ల సీల్స్ రికార్డులకెక్కాడు.
అనంతరం పాక్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (2), క్రెయిగ్ కీరన్ పావెల్ (4) నిరాశపరిచారు. న్క్రుమా బోనర్ (5) కూడా విఫలమయ్యాడు. షాహీన్ ఆఫ్రిది చెలరేగడంతో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండిస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో రోస్టన్ ఛేజ్ (22), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (55) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి 50కిపైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో విండీస్ లక్ష్యం దిశగా సాగింది. కొద్ది వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరడంతో విండీస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది.
కైల్ మేయర్స్ కూడా డకౌట్ అవ్వడంతో విండీస్ ఆశలు వదిలేసుకుంది. అయితే జాసన్ హోల్డర్ (16), జాషువా డా సిల్వా (13)లు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది మరోసారి విండీస్ జట్టును దెబ్బకొట్టారు. దీంతో కరేబియన్ల ఓటమి దాదాపు ఖాయం అయింది. ఈ సమయంలో బౌలర్ కీమర్ రోచ్ (30; 52 బంతుల్లో 2x4) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 217 రన్స్ చేయగా.. విండీస్ 253 రన్స్‌కు ఆలౌటైంది. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ఇదే మైదానంలో ఆరంభం కానుంది. అంతకుముందు పాకిస్తాన్ టీ20 సిరీసును 1-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా మూడు టీ20ల్లో రిజల్ట్స్ రాలేదు.