బార్బడోస్: వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊరట కలిగించే విజయం దక్కింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఘోర ఓటమి అనంతరం సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టు.. వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. దాంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.
విజయానికి చేరువైన వెస్టీండీస్ చివరకు ఓటమికి తలవొంచింది. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా ఆ జట్టు 28 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షాకిబ్ మహమూద్ వేసిన చివరి ఓవర్లో అకిల్ హుస్సేన్.. 4,4, 6, 6, 6తో 28 పరుగులు రాబాట్టాడు. తొలి బంతిని డాట్ చేయడం విండీస్ ఓటమిని శాసించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ఆ జట్టులో జాసన్ రాయ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), మోయిన్ అలీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), టామ్ బాంటన్(25) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఫాబియన్ అలెన్, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, అకీల్ హుస్సేన్, కీరన్ పొలార్డ్, రొమరియో తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే సాధించింది. విండీస్ జట్టులో రొమారియో షెపర్డ్(28 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో 44 నాటౌట్), అకేల్ హోస్సేన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు పడగొట్టగా,ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.