బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి అయిదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్ 45 బంతుల్లో 83 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (43; 41 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆఖర్లో షెఫార్డ్ (22; 12 బంతుల్లో, 4 ఫోర్లు) దూకుడుగా పరుగులు సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పావెల్.. పూరన్ (14; 23 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.

పూరన్ తనకి శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడటం, పావెల్ కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో వెస్టిండీస్ స్కోరుబోర్డు నెమ్మదించింది. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టు విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆఖర్లో మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్; 6 బంతుల్లో, 3 ఫోర్లు), షెఫార్డ్ దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ 158 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మద్, లివింగ్‌స్టోన్, మౌస్లీ తలో రెండు వికెట్లు, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గత మ్యాచ్ సెంచరీ హీరో ఫిలిప్ సాల్ట్ గోల్డెన్ డకౌటయ్యాడు. మొదటి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ విల్ జాక్స్ (38; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ రెండో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే స్వల్ప వ్యవధిలో జాక్స్, బట్లర్ ఔటైనప్పటికీ.. లివింగ్‌స్టోన్ (23 నాటౌట్; 11 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు.వెస్టిండీస్ బౌలర్లలో షెఫార్డ్ రెండు వికెట్లు, అకెల్ హొస్సేన్ ఒక్క వికెట్ తీశారు. బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, భారత కాలమాన ప్రకారం మూడో టీ20 నవంబర్ 15న అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
JOS BUTTLER HITS 115 METER SIX. 🤯
— Tanuj Singh (@ImTanujSingh) November 11, 2024
- What a Monster Six by Jos Buttler. 🥶 pic.twitter.com/SvukcserJk