హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల రూపంలో బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ హక్కుల్ని స్టార్ ఇండియా రూ.16,347.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మీడియా హక్కుల ఒప్పందంగా ఇది నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం స్టార్ ఇండియా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు బీసీసీఐ రూ.55 కోట్లు చెల్లించనుంది. తాజా వేలం ప్రకారం ఐపీఎల్‌కు స్టార్ ఇండియా ఏడాదికి రూ.3,270 కోట్లు చెల్లిస్తుంది.
ఇది ప్రస్తుతం టీమిండియా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు చెల్లిస్తున్న దాని కన్నా రూ.12 కోట్లు అధికం కావడం విశేషం. 2012-18 వరకు స్టార్ ఇండియా కోహ్లీసేన మ్యాచ్‌ల టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులు చెల్లిస్తున్నది రూ.3,851 కోట్లు. అంటే భారత్‌లో టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా బోర్డుకు లభించే ఆదాయం 43 కోట్లన్నమాట.

తాజా ఐపీఎల్ మీడియా హక్కుల వేలంతో ఐపీఎల్‌కు ప్రపంచంలో అత్యధిక విలువైన క్రీడా లీగ్‌ల్లో మూడో స్థానం దక్కింది. ప్రపంచంలో అమెరికాలో జరిగే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (రూ.144 కోట్లు), ఐరోపాలో జరిగే ఫుట్‌బాల్ ప్రిమియర్ లీగ్ (రూ.84 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విశేషాలు:
* 2008లో సోనీ సంస్థ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులకు పదేళ్ల కాలానికి రూ. 8,200 కోట్లు చెల్లించింది. ఇప్పుడు స్టార్ ఇండియా ఐదేళ్ల (2018-22) కాలానికే దానికి దాదాపు రెండింతలు (16,347 కోట్లు) వెచ్చించడం విశేషం.
* గతంలో సోనీ డీల్‌తో బీసీసీఐ ఏడాదికి రూ. 820 కోట్లు ఆర్జిస్తే.. ఇప్పుడు స్టార్ ఇండియా ఏడాదికి రూ. 3269 కోట్లు చెల్లించనుంది. అంటే సోనీ చెల్లించిన దానితో పోలిస్తే ఇది నాలుగింతలు ఎక్కువ.
* తాజా ఒప్పందం ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మీడియా హక్కుల ఒప్పందంగా నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం స్టార్ ఇండియా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 55 కోట్లు చెల్లించనుంది.
* రూ.16,347.5 కోట్లు: ఐదేళ్లకు స్టార్ చెల్లిస్తున్న ఈ మొత్తం గతంతో పోల్చితే ఏడాదికి మీడియా హక్కుల విలువ ఏకంగా 158 శాతం పెరిగింది.
* రూ. 528 కోట్లు: ప్రసార, డిజిటల్ హక్కులకు కలిపి స్టార్ వేసిన బిడ్‌కు.. సమీప ప్రత్యర్థి దాఖలు చేసిన బిడ్ మొత్తానికి ఉన్న అంతరం
* రూ.11,050 కోట్లు: కేవలం టీవీ హక్కుల కోసం సోనీ దాఖలు చేసిన మొత్తం. స్టార్ దాఖలు చేసిన బిడ్‌కంటే ఇది రూ. 4854 కోట్లు ఎక్కువ.
* రూ. 3900 కోట్లు: కేవలం భారత్ డిజిటల్ మార్కె ట్‌కు ఫేస్‌బుక్ దాఖలు చేసిన బిడ్ విలువ ఇది. ఎయిర్‌టెల్ ఇదే హక్కుల కోసం రూ. 3280 కోట్లకు వేసిన బిడ్ రెండో అత్యధికం.
* ఐపీఎల్, టీమిండియా ఆడే మ్యాచ్‌లు ద్వారా బీసీసీఐ ఏడాదికి సుమారు రూ. 4618 కోట్లు ఆర్జిస్తుంటే వాటిలో ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారానే రూ. 3269 కోట్లు రావడం గమనార్హం.
* ఐపీఎల్ ప్రసార, డిజిటల్ హక్కుల ద్వారానే కాకుండా బీసీసీఐ ఇతర మార్గాల్లోనూ భారీగానే ఆర్జిస్తోంది.
* మొబైల్ కంపెనీ ఒప్పో టీమిండియాను ఐదేళ్లపాటు స్పాన్సర్ చేసినం దుకు రూ. 1079 కోట్లు చెల్లిస్తోంది.
* ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం మరో మొబైల్ కంపెనీ వివో కూడా ఐదేళ్ల కాలానికి రూ. 2199 కోట్లు చెల్లిస్తోంది.
* ఇక భారత్‌లో ఆడే మ్యాచ్‌ల స్పాన్సర్‌షిప్ కోసం పేటీఎం సంస్థ నాలుగేళ్ల కాలానికి రూ. 203 కోట్లు చెల్లిస్తోంది.
* అలాగే భారత్ స్వదేశంలో ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌ల ప్రసార హక్కుల(2012-18 వరకు) స్టార్ ఇండియా ఇప్పటికే రూ. 3851 కోట్లు చెల్లిస్తోంది.