సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో జట్టు సభ్యులు కలిసికట్టుగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆడతారు. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం ఎప్పుడూ తమదైన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. వికెట్ కోల్పోకుండా మంచి స్కోరు సాధిస్తున్న సమయంలో ఓపెనర్లు మహ్మద్ నఫే, యాసిర్ ఖాన్ కలిసి తమ జట్టుకు ఒక అరుదైన రనౌట్ బహుమతిని అందించారు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ షాహీన్స్ జట్టు బంగ్లాదేశ్ ఏ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షాహీన్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా.. దానికి బదులుగా బంగ్లాదేశ్ 'ఏ' జట్టు 16.5 ఓవర్లలో అన్ని విరెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ బ్యాటర్ల మధ్య ఒక పెద్ద అపార్థం చోటుచేసుకుంది. పాకిస్థాన్ షాహీన్స్ ఓపెనర్లు మహ్మద్ నఫే, యాసిర్ ఖాన్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని డార్విన్ టీఐఓ స్టేడియంలో బంగ్లాదేశ్ 'ఏ'తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు మహ్మద్ నఫే, యాసిర్ ఖాన్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. 11 ఓవర్ల వరకు పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. 12వ ఓవర్ మొదటి బంతికి మహ్మద్ నఫే బౌలర్ చౌదరి బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్‌కు తగిలి అక్కడే ఆగిపోయింది.
యాసిర్ ఖాన్ నాన్-స్ట్రైక్ ఎండ్ నుంచి పరిగెత్తుకుంటూ మహ్మద్ నఫే దగ్గరికి వచ్చాడు. ఇద్దరు బ్యాటర్లు ఎదురుగా నిలబడ్డారు. ఆ తర్వాత యాసిర్ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బంతిని పట్టుకొని బౌలర్‌కు ఇచ్చాడు. బౌలర్ బెయిల్స్ పడగొట్టాడు. రనౌట్ కావడంతో యాసిర్ చాలా కోపం తెచ్చుకున్నాడు. యాసిర్ పిచ్ పైనే తన బ్యాట్‌ను విసిరేసి, తన సహచరుడితో గట్టిగా వాగ్వాదం చేస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా అతను బూతులు కూడా తిట్టాడు. ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
నిజానికి జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు అపార్థం వల్ల వికెట్ కోల్పోయినప్పుడు ఇలాంటి డ్రామా సర్వసాధారణం. కానీ పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఇలాంటివి జరగడం మాత్రం సాధారణం. పాక్ జట్టు గెలిచినా, సోషల్ మీడియాలో మాత్రం యాసిర్ కోపం, నఫే గందరగోళం హాట్ టాపిక్‌గా మారాయి. రనౌట్ కావడమే కాదు.. ఆ తర్వాత బ్యాట్‌ను విసిరికొట్టడం ద్వారా యాసిర్ ఈ రనౌట్‌ను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాడని చెప్పాలి.