ప్రపంచ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌గా చరిత్రలో నిలిచాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొని జట్టుకు విజయాలు అందించి 'మిస్టర్ కూల్'గా ప్రసిద్ధి చెందాడు. ఫినిషర్‌గా ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతో మంది ఆటగాళ్లు వచ్చినా.. మహీ స్థానానికి ఎవరూ భర్తీ చేయలేకపోయారు!
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ప్రత్యేకంగా ఓ పనిచేస్తాడు. ప్రత్యర్థిపై గెలిచిన అనంతరం స్టంప్స్‌ను తీసుకుని సంబరాలు చేస్తాడు. ఆ వికెట్‌ను తనతో తీసుకెళ్తాడు. ఇతర ఆటగాళ్లంతా విజయానందంలో మునిగిపోతే.. మహీ మాత్రం ఇలా భిన్నంగా చేస్తాడు. అయితే ఆ స్టంప్స్‌తో సెలబ్రేషన్స్ ఏంటని? వాటిని అసలు ఏం చేస్తాడనే ప్రశ్న ఎంతోమందికి కలిగింది.

ఈ ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ధోనీ సమాధానమిచ్చాడు. ''విజయానికి గుర్తుగా నేను స్టంప్స్ తీసుకెళ్తాను. మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాను? ఎలా పోరాడి గెలిచాం? ఇలాంటి విషయాలను గుర్తుచేసుకోవడానికి స్టంప్స్‌ను తీసుకెళ్తాను. మా ఇంట్లో వీటికి ప్రత్యేక స్థానంలో భద్రపరిచాను'' అని ధోనీ తెలిపాడు. ధోనీకి బైక్‌లు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. కానీ ధోనీ-స్టంప్స్ లవ్ స్టోరీ కొందరికి మాత్రమే తెలుసు.
అయితే 2015లో మైదానంలోని స్టంప్స్‌ను ఆటగాళ్లు తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది. దాదాపు రూ.8 లక్షలు వెచ్చించి లెడ్ స్టంప్స్‌ను ఉపయోగించడం మొదలుపెట్టడంతో ఐసీసీ ఈ నిబంధనను తీసుకువచ్చింది. అయితే జ్ఞాపకాల కోసం స్టంప్స్‌ను తీసుకెళ్లాలనుకునే ధోనీకి ఇది ఓ సమస్యగా మారింది. దీంతో ఐసీసీని ధోనీ ఓ ప్రత్యేక అభ్యర్థన కూడా చేశాడంట. ఆటగాళ్ల కోసం చెక్కతో చేసిన స్టంప్స్‌ను అందుబాటులో ఉంచాలని ధోనీ అడిగాడని, కానీ ఐసీసీ సానుకూలంగా స్పందించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.