ఖేల్‌రత్న: మిథాలీ అంటే బీసీసీఐకి ఎందుకంత చిన్నచూపు
హైదరాబాద్: మిథాలీ రాజ్.... పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్. తన కెప్టెన్సీలో భారత మహిళ జట్టుని రన్నరప్‌గా నిలిపింది. అంతేనా! మహిళల వరల్డ్ కప్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక మహిళా బ్యాట్స్‌మెన్.
ఇలా ఎన్నో ప్రపంచ మహిళా క్రికెట్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంత గొప్ప క్రీడాకారిణికి ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం దక్కకపోవడం ఆశ్చర్యమే. నిజానికి మిథాలీకి ఖేల్ రత్న పురస్కారం ఎప్పుడో దక్కాలి. ఆమె పేరును బీసీసీఐ ఇప్పటిదాకా ఖేల్‌రత్న పురస్కారానికి ప్రతిపాదించక పోవడం విశేషం.

ఖేల్‌రత్నకు మిథాలీ పేరుని సిఫారసు చేయని బీసీసీఐ
ఈ ఏడాది ఖేల్‌రత్నకు పేర్లను ప్రతిపాదించేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీ. కానీ అప్పటికి బీసీసీఐ ఆమె పేరును సిఫారసు చేయలేదు. ఈ అవార్డుల కోసం మిగతా క్రీడల నుంచి పలు ప్రతిపాదనలు క్రీడాశాఖకు అందాయి. పుజారా, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్‌ల పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదించినా.. ఖేల్‌రత్నకు మాత్రం ఎవరి పేరు పంపలేదు.

మహిళల వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిపింది
మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టుని రన్నరప్‌గా నిలిపిన ఆమెతో పాటు జట్టులోని పలువురి క్రీడాకారిణుల పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీసీసీఐ రాజీవ్ ఖేల్ రత్నకు మిథాలీ పేరుని ప్రతిపాదించకపోవడం విఛారకరం. అసలు బీసీసీఐకి మిథాలీ అంటే ఎందుకంత చిన్నచూపే అర్ధం కావడం లేదు.

సర్దార్ సింగ్, ఝఝారియాలకు ఖేల్ రత్న
ఇదిలా ఉంటే భారత హాకీ టీమ్ కెప్టెన్ సర్దార్ సింగ్, బాక్సర్ మనోజ్ కుమార్, పారాలింపిక్ మెడలిస్ట్స్ దీపా మాలిక్, దేవేంద్ర ఝఝారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భాటి పేర్లు ఖేల్‌రత్న కోసం ప్రతిపాదించారు. అయితే వీరిలో ఈ ఏడాది ఇద్దరికి మాత్రమే ఖేల్ రత్న అవార్డుని ఇస్తున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. భారత హాకీ టీమ్ కెప్టెన్ సర్దార్ సింగ్, పారాలింపియన్ దేవేంద్ర ఝఝారియాలకు మాత్రమే ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డు లభించింది.

ఇప్పటివరకు 32 మందికి ఖేల్ రత్న
గతేడాది ఈ అవార్డుని నలుగురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991లో ప్రవేశపెట్టిన ఖేల్ రత్న అవార్డును ఇప్పటివరకు 32 మంది అందుకున్నారు. అయితే కొందరు క్రీడాకారులు పేర్లను గడువు తర్వాత కూడా ఖేల్‌రత్నకు ప్రతిపాదించిన సందర్భాలున్నాయి. గత ఏడాది పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్, జీతు రాయ్‌ల పేర్లను ఒలింపిక్స్ ప్రదర్శన ఆధారంగా గడువు తర్వాతే ఖేల్‌రత్నకు ప్రతిపాదించారు.

వచ్చే ఏడాదైనా బీసీసీఐ సిఫారసు చేస్తుందా?
అయితే ఈ ఏడాది కూడా గడువు ముగిసినప్పటికీ వరల్డ్ కప్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని మిథాలీ రాజ్ పేరుని ఖేల్ రత్న అవార్డుకి పంపాల్సిందిగా పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలకు బీసీసీఐ ఉపక్రమించలేదు. మరి వచ్చే ఏడాదైనా ఆమె పేరును ఖేల్‌రత్నకు సిఫారసు చేస్తారేమో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications