చండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌ల పరంపర కంటిన్యూ అవుతోంది. చివరి బంతి వరకూ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది తెలియట్లేని పరిస్థితి నెలకొంది. ఈ వారంలో ఇప్పటివరకూ జరిగినవన్నీ అలాంటి మ్యాచ్‌లే. చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరును మినహాయిస్తే- మిగిలినవన్నీ కూడా లాస్ట్ బాల్‌కు విన్నింగ్ షాట్స్ ఆడినవే. ఐపీఎల్ స్పెషాలిటీని చాటిన మ్యాచ్‌లే.
కోల్‌కత నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన మ్యాచ్.. ఎంత ఉత్కంఠతకు గురిచేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్. ఈ మ్యాచ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. చివరి ఆరు బంతులకు 29 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చడం అంటే మాటలు కాదు. యష్ దయాళ్ వేసిన ఆ ఓవర్ చివరి అయిదు బంతులకు అయిదు సిక్సర్లు కొట్టాడు రింకూ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి హైటెన్షనే కనిపించింది. చివరి ఓవర్‌కు అయిదు పరుగులు చేయాల్సిన ఉన్నప్పటికీ- చివరి బంతి వరకూ ఈ రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. హర్షల్ పటేల్ సంధించిన ఆ ఓవర్‌లో రెండు వికెట్లు పడటంతో మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వైపు తిరిగినా.. చివరి బంతి లెగ్‌బైగా వెల్లడం, దాన్ని అవేష్ ఖాన్ రన్ తీయడంతో మ్యాచ్ లక్నో వైపు మొగ్గింది.
ఢిల్లీ కేపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి బంతి వరకూ వెళ్లింది. చివరి ఓవర్‌లో అయిదు పరుగులు చేయాల్సిన దశలో.. క్రీజ్‌లో ఉన్న టిమ్ డేవిడ్.. విన్నింగ్ షాట్ ఆడాడు. నోర్ట్జె వేసిన ఆ ఓవర్‌లో 2, 3 బంతులు డాట్స్‌గా పడ్డాయి. దీనితో ఢిల్లీ కేపిటల్స్ గెలుస్తుందనే భావించారంతా. చివరి బంతికి రెండు పరుగులను సాధించాడు టిమ్ డేవిడ్. చివరి పరుగును పూర్తి చేయడానికి డేవిడ్ కొట్టిన డైవ్‌ను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు.
పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయం కూడా ఇలాంటిదే. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్ సామ్ కుర్రన్ అద్భుతంగా బౌల్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాచ్ ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ వైపు మొగ్గింది. ఆ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తెవాతియా.. ఆ ఓవర్ అయిదో బంతిని బౌండరీకి తరలించి జట్టుకు గెలిపించాడు. ఇలాంటి ఫైనల్ బాల్ థ్రిల్లర్స్ మున్ముందు మరిన్ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయం.