కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ బోణీ చేసింది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది కోల్‌కత నైట్‌రైడర్స్. ఐపీఎల్‌లో ఇది తొమ్మిదో మ్యాచ్.
భారీ తేడా..: తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. హోరాహోరి పోరు తప్పదని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను రఫ్పాడించిన ఆర్సీబీ- ఇక్కడ మాత్రం చేతులెత్తేసింది.

శార్దుల్ సునామీ..: స్కోర్ కార్డ్ 200 పరుగులను దాటిందంటే ముగ్గురే ముగ్గురు బ్యాటర్లు కారణం అయ్యారు. ప్రత్యేకించి శార్దుల్ ఠాకూర్. ఫాస్ట్ బౌలర్‌గా మాత్రమే మనకు తెలిసిన శార్దుల్- ఈ మ్యాచ్‌తో ఇంకో మెట్టు పైకెక్కినట్టే. అసలు సిసలు టీ20 క్రికెటింగ్ షాట్లను ఆడాడు. భవిష్యత్‌లో అక్షర్ పటేల్ తరహాలో ఆల్‌రౌండర్‌గా ఎదిగే లక్షణాలు ఉన్నాయనే సంకేతాలు పంపించాడు.
సత్తా చాటిన గుర్బాజ్..: శార్దుల్ ఠాకూర్‌తో పాటు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్- 57, మిడిలార్డర్‌లో రింకూ సింగ్- 46 భారీ స్కోర్లు సాధించారు. మిగిలిన వారెవరూ రాణించలేదు. వెంకటేష్ అయ్యర్-3, మన్‌దీప్ సింగ్-0, కేప్టెన్ నితీష్ రాణా-1, ఆండ్రీ రస్సెల్స్-0 పరుగులు చేశారు. సునీల్ నరైన్-0, ఉమేష్ యాదవ్-6 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు.

కోహ్లీ సహా..:23 పరుగులు చేసిన కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ-21, మైఖేల్ బ్రేస్‌వెల్-19, డేవిడ్ విల్లీ-20, అక్ష్‌దీప్- 17 మాత్రమే వ్యక్తిగతంగా డబుల్ డిజిట్‌ను అందుకోగలిగారు. కోహ్లీ సహా ఆర్సీబీ బ్యాటర్లందరూ విఫలం అయ్యారు. మిగిలిన సగం మంది బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు.
స్పినర్ల వల..: మొత్తానికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం స్పిన్నర్ల వలలో చిక్కుకుంది. వరుణ్ చక్రవర్తి-4, సుయాష్ శర్మ-3, సునీల్ నరైన్- 2.. ఈ ముగ్గురే ఆ జట్టు పతనాన్ని శాసించారు. వరుణ్ చక్రవర్తి 3.4 ఓవర్లల్లో 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ నాలుగు ఓవర్లల్లో 30 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్ నాలుగు ఓవర్లల్లో 16 పరుగులే ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.