
మిడిలార్డర్ సమస్య
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. దీంతో ఆ జట్టు ఓపెనర్లు అయిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో వీరిద్దరూ వరుసగా నాలుగు సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పారు.

గత మ్యాచ్‌ల్లో ఓపెనర్లు విఫలం
అయితే, చివరగా సన్‌రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సన్‌రైజర్స్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా సన్‌రైజర్స్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది.

సీఎస్‌కేతో మ్యాచ్‌లో మార్పులు
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్... ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనున్న మ్యాచ్‌లో ఆ జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీ పలు మార్పులు ఉంటాయని ఇప్పటికే చెప్పాడు.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న సీఎస్‌కే
మరోవైపు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను మరింత సులభతరం చేసుకుంటుంది.

SRH vs CSK హెడ్ టు హెడ్ గణాంకాలు:
* ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఇరు జట్లు 10 సార్లు తలపడగా సీఎస్‌కే 8-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది
* ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో 21 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
* సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఎక్కువ వికెట్లను(16) పవర్ ప్లేలోనే కోల్పోయింది. అదే సన్‌రైజర్స్ మాత్రం 3 వికెట్లను మాత్రమే కోల్పోయింది.
* ఐపీఎల్ 2018 సీజన్‌లో ఈ రెండు ఫైనల్లో తలపడ్డాయి. గత సీజన్‌లో సన్‌రైజర్స్... సీఎస్‌కేతో తలపడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
* ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక్కసారి కూడా ఔట్ చేయలేదు.


Click it and Unblock the Notifications












