క్రికెట్ ప్రపంచంలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి ఎవరైనా, పిచ్ బౌలింగ్‌కు గొప్పగా అనుకూలిస్తున్నా ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు. అందుకే భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెహ్వాగ్‌కు ఫ్యాన్స్ ఉంటారు. అయితే మీడియా సమావేశంలో వీరేంద్ర సెహ్వాగ్ గురించి బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
దానికి షకిబ్.. సెహ్వాగ్ అంటే తెలియని వ్యక్తిగా 'ఎవరు?' అని సమాధానమివ్వడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌పై విజయంలో షకిబ్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేశాడు. షకిబ్ అర్ధశతకంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఆ ఛేదనలో షకిబ్ విఫలమయ్యాడు. నోకియా బౌలింగ్‌లో పుల్ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. నాలుగు బంతుల్లో మూడు పరుగులే చేశాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ షకిబ్‌ను విమర్శించాడు. కాసేపు క్రీజులో ఉండటానికి ప్రయత్నించాల్సిందని అన్నాడు. హెడెన్, గిల్‌క్రిస్ట్‌లా షార్ట్ బాల్స్‌లో పుల్ షాట్ ఆడాలనుకోవడం పొరపాటు అని, తన ప్రమాణాలకు తగ్గట్లుగా స్ట్రోక్స్ ప్లేతో ఆడాల్సిందని పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడు, మాజీ కెప్టెన్ అయిన షకిబ్ నుంచి ఇలాంటి ప్రదర్శన కోరుకోలేదని సెహ్వాగ్ తెలిపాడు.
దీని గురించి షకిబ్‌ను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడగగా.. ''ఎవరు? విమర్శలకు ఏ ఆటగాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జట్టుకు సాయపడటమే ఆటగాళ్ల బాధ్యత. ఓ బ్యాటర్ పరుగులు సాధించాలి. ఓ బౌలర్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. వికెట్లు కాస్త అదృష్టంపై ఆధారపడుతుంది. ఇక ఓ ఫీల్డర్ పరుగులను నియత్రించాలి. క్యాచ్‌లు అందుకోవాలి. ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. అయితే జట్టుకు అండగా నిలవకలేపోయిన సందర్భంలో ఆటగాళ్లపై చర్చ సాగుతుంటుంది. ఇది అంత చెడ్డ విషయమేమి కాదు'' అని షకిబ్ బదులిచ్చాడు.