మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియా.. భారత్‌లో తన పర్యటనను కొనసాగించనుంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. అయిదు మ్యాచ్‌లో సిరీస్ ఇది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడింది టీమిండియా. 2-1 తేడాతో ఆ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే.
దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. విశాఖతో పాటు తిరువనంతపురం, గువాహటి, నాగ్‌పూర్, బెంగళూరుల్లో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ జరుగుతాయి.

ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) దూరం అయ్యాడు. ఇందులో ఆడట్లేదని అతను ప్రకటించాడు. వరల్డ్ కప్ 2023, అంతకు ముందు నుంచీ సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నందున కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ కారణంతో జట్టుకు అందుబాటులో ఉండలేనని, స్వదేశానికి తిరిగి వెళ్తానని తెలిపాడు.
ఈ పరిస్థితుల్లో అతని వన్డే వరల్డ్ కప్ కేరీర్ ముగిసినట్టేనంటూ ప్రచారం జరుగుతోంది. డేవిడ్ వార్నర్ ఆడిన చివరి వరల్డ్ కప్ ఇదే అవుతుందని, ప్రపంచకప్ 2027 నాటికి అతను జట్టుకు అందుబాటులో ఉండడని, రిటైర్ అవుతాడనేది ఆ వార్తలు, ప్రచారాల ప్రధాన సారాంశం.
దీనిపై స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తన అధికారిక ఎక్స్ అకౌంట్.. ఓ పోస్ట్ పెట్టింది. వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో వార్నర్ సాధించిన పరుగులు, సెంచరీలు/అర్ధసెంచరీలను వివరించింది. అద్భుతమైన రికార్డులతో డేవిడ్ వార్నర్ వన్డే ఇంటర్నేషనల్స్ వరల్డ్ కప్ కేరీర్ ముగిసిందంటూ పేర్కొంది.
ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో ఆడిన మ్యాచ్‌లల్లో 1,527 పరుగులు చేశాడీ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్. ఇందులో ఆరు సెంచరీలు, అయిదు అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 56.55ను నమోదు చేశాడు.101.46 స్ట్రైక్ రేట్. వ్యక్తిగత అత్యధిక పరుగులు 178.
తన వరల్డ్ కప్ కేరీర్ ముగిసిందంటూ వచ్చిన ఈ వార్తలపై స్పందించాడు వార్నర్. తన కేరీర్ ఫినిష్ అయిందని ఎవరు చెప్పారు?.. అంటూ సింగిల్ లైన్ రిప్లై ఇచ్చాడు. 2027 వరల్డ్ కప్‌లోనూ తాను ఆడతాననే సందేశాన్ని పంపించాడు. ఇప్పట్లో వన్డే ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.