
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) శుభారంభం చేసింది. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (48; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టాడు. కొన్ని అద్భుతమైన క్రికెట్ షాట్‌లతో అలరించాడు. మొదటి మ్యాచ్ అయినా.. ఆర్‌సీబీ టాప్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ ఆట అందరిని ఆకట్టుకుంది. మాజీలు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్‌కు సంబందించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో (25 డిసెంబర్ 1994) జన్మించాడు. చాలా మంది పిల్లలలాగే వెంకటేశ్ అయ్యర్ అందరి కూడా బాగా చదువుకోవాలని చెప్పేవాడట. అయితే అతడి తల్లి మాత్రం చదువుతో పాటు ఆటలు కూడా ఆడమని చెప్పేదట. అయితే దాదాపు 19 సంవత్సరాల వరకు అతడు ఎక్కువగా క్రికెట్ ఆడలేదట. 2016లో ఇంటర్మీడియట్ పరీక్షలలో టాప్ లేపాడు. ఆపై బికామ్ డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం చార్టర్డ్ అకౌంట్ చేయాలని నిర్ణయించున్నాడు. అయితే సీఏ ఫైనల్స్ పూర్తవ్వాలంటే.. క్రికెట్ కెరీర్‌కు తాత్కాలికంగా పులిస్టాప్ పెట్టాల్సి వచ్చింది. దాంతో ఎంబీఏ ఫైనాన్స్ ఎంచుకున్నాడు. అదృష్టవశాత్తూ కాలేజీ ఫ్యాకల్టీకి క్రికెట్ అంటే ఇష్టం. ఆటలో బాగా రాణిస్తున్న అయ్యర్‌కు వారు మద్దతు ఇచ్చారు.
వెంకటేశ్ అయ్యర్ మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఎంబీఏ, ఆటను బ్యాలెన్స్ చేసుకున్నాడు. క్రికెట్ ఆడకుంటే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో చదివేవాడట. చెన్నైలో వారాంతపు లీగ్ క్రికెట్ ఆడుతూ ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేశాడు. చదువు అనంతరం 2018లో అకౌంటింగ్ సంస్థ డెలాయిట్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే క్రికెట్ కోసం అయ్యర్ ఆ ఆఫర్‌ని విడిచిపెట్టాడు. దాంతో ఇంట్లో నుంచి ఒత్తిడి వచ్చింది. చివరకు అదే ఏడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ రంజీ జట్టులో అరంగేట్రం చేశాడు. ఆపై ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఓ గేమ్‌లో అదరగొట్టాడు. అనంతరం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు.
2020-21 సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 75.66 సగటుతో మరియు 149.34 స్ట్రైక్ రేట్‌తో 227 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 198 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దాంతో మధ్యప్రదేశ్ 3 వికెట్లకు 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేశీయ ప్రదర్శనతో అయ్యర్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2021కు గాను కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని తీసుకుంది. అయితే తొలి దశలో ఆడే అవకాశం రాలేదు. అయితే జట్టుతో గడిపిన సమయం అతని కలిసొచ్చింది. నెట్స్‌లో పాట్ కమిన్స్ మరియు సునీల్ నరైన్ వంటి స్టార్ బౌలర్లను సునాయాసంగా ఎదురొన్నాడు. దాంతో రెండో దశలో ఆడే అవకాశం దక్కింది.
వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగపరుచుకున్నాడు. 27 బంతుల్లో 42 పరుగులు చేయడంతో వచ్చే మ్యాచులలో కూడా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయ్యర్ మీడియం పేస్ బౌలర్ కూడా. మైదానం వెలుపల, అయ్యర్ చదవడం మరియు వంట కార్యక్రమాలు, సినిమాలు చూడటం ఇష్టపడతారు. ఇక అతను సూపర్ స్టార్ రజనీకాంత్‌కి పెద్ద అభిమాని. ఐపీఎల్ 2021 ద్వారా తనమార్క్ ఆటతో అభిమానులను అలరిస్తాడట.