ముంబై: ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో వెస్టిండీస్ పైన నెగ్గితే భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట మరిన్ని రికార్డులు నమోదు కానున్నాయి. భారత్ - విండీస్ ఇప్పటి వరకు మూడుసార్లు ట్వంటీ 20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. రెండుసార్లు విండీస్ గెలవగా, ఓసారి భారత్ గెలిచింది.
2010లో జరిగిన ప్రపంచ కప్‌లో క్రిస్ గేల్ 66 బంతుల్లో 98 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. వాంఖేడే స్టేడియం భారత్‌కు బాగా కలిసొచ్చే మైదానం. 2011లో భారత్ ఇక్కడే ప్రపంచ కప్ సాధించింది.
భారత్‌కు ఇది మూడో ట్వంటీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్. విండీస్‌కు ఇది నాలుగో సెమీ ఫైనల్. రేపటి మ్యాచులో భారత్ గెలిస్తే.. ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో తన జట్టును మూడుసార్లు ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా ధోని రికార్డు సొంతం చేసుకుంటాడు.
ఇప్పటి వరకు ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో శ్రీలంక మాత్రమే మూడుసార్లు ఫైనల్‌కు చేరింది. విండీస్‌తో సెమీస్‌లో గెలిస్తే భారత్ ఆ రికార్డును సమం చేస్తుంది.
2009లో జరిగిన టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు విండీస్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విండీస్ నెగ్గింది. ఆ మ్యాచులో యువరాజ్ 43 బంతుల్లో 67 పరుగులు చేసి రాణించాడు. కానీ విండీస్ గెలిచింది. విండీస్ తరఫున బ్రావో 66 నాటౌట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు.
2010లో సొంతగడ్డపై జరిగిన టోర్నీలో విండీస్ 14 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. గేల్ 66 బంతుల్లో 98 పరుగులు చేశాడు. గేల్ ధాటికి విండీస్ 169 చేసింది. ఆ తర్వాత భారత్ 155 పరుగులే చేసింది. 2014లో మాత్రం విండీస్‌ను భారత్ ఓడించింది. రోహిత్ 55 బంతుల్లో 62 పరుగులతో రాణించాడు.

ఫ్యాన్స్... కోహ్లీ వర్సెస్ సచిన్ చర్చ
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం క్రికెట్ అభిమానుల మధ్య కోహ్లీ వర్సెస్ సచిన్ టెండుల్కర్ చర్చ జోరుగా సాగుతోంది. ఒకరితో ఒకరిని పోల్చలేం. అయితే, అభిమానులు సోషల్ మీడియాలో గణాంకాలతో సచిన్‌ను, కోహ్లీని పోల్చి చూస్తున్నారు.
సచిన్ 27 సంవత్సరాల 144 రోజుల వయస్సులో 249 మ్యాచుల్లో 42.10 సగటుతో 9,262 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ అదే వయసులో పరుగుల విషయంలో సచిన్ కన్నా వెనుకబడి ఉన్నాడు.
సగటు మాత్రం ఎక్కువ ఉంది. అదే వయస్సులో కోహ్లీ 171 మ్యాచుల్లో 51.51 సగటుతో 7,212 పరుగులు చేశాడు. ఇందులో 25 శతకాలు ఉన్నాయి. సచిన్ 171 మ్యాచుల్లో 5,828 పరుగులు చేశాడు. ప్పటికి సగటు 38.85గా ఉంది. 12 శతకాలు చేశాడు.
సెంచరీలలో కూడా కోహ్లీ ముందంజలో ఉన్నాడు. 162వ ఇన్నింగ్స్ నాటికి 25వ శతకాన్ని నమోదు చేశాడు. అదే ఫీట్‌ను సచిన్ టెండుల్కర్ 234వ ఇన్నింగ్సులో సాధించాడు. 20వ శతకాన్ని కోహ్లీ 106వ ఇన్నింగ్సులో చేయగా, సచిన్ 197వ ఇన్నింగ్స్ వరకు ఆగాడు. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు సచిన్ కంటే తక్కువేనని కోహ్లీ చెప్పడం గమనార్హం.