క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. త్వరలో ఒకింటి వాడు కాబోతోన్నాడు. సానియా చందోక్ ను పెళ్లాడనున్నాడు. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ నిశ్చితార్థం ముగిసింది. ముంబైలో కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగింది.
సానియా చందోక్.. ముంబైకి చెందిన వ్యాపారి రవి ఘాయ్ మనవరాలు. ఆమె కుటుంబం.. హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో కొనసాగుతోంది. ఘాయ్ కుటుంబానికి చెందిన గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ గ్రూప్ 'ది బ్రూక్లిన్ క్రీమెరీ' వాళ్లకు చెందినదే. బాస్కిన్ రాబిన్స్ ఇండియా కార్యకలాపాలను కూడా ఘాయ కుటుంబమే నిర్వహిస్తోంది. ముంబైలోని ప్రముఖ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా ఈ గ్రూప్ లోనిదే.

2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్రూక్లిన్ క్రీమెరీ మాతృ సంస్థ గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 624 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని ఆర్జించిందంటే అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రూప్ కు చెందిన 'మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ'కి సానియా చందోక్ డిజిగ్నేటెడ్ పార్టనర్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్నారు. 2022లో దీన్ని ఆమె ప్రారంభించారు.
25 ఏళ్ల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండుల్కర్. దేశీయ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. గోవా తరఫున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 17 మ్యాచ్‌లలో 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండుల్కర్ అయిదు మ్యాచ్‌లలో ఆడాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అతని వ్యక్తిగత బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. 1/9. బ్యాటింగ్ లో 38.00 యావరేజ్, బౌలింగ్ ఎకానమీ రేటు 9.36. యావరేజ్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్.. 24.3. అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అతనికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు అభిమానులు.