ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ముకుస్ చౌదరి.. లక్నో జట్టుకు 3 వికెట్ల తేడాతో అసాధ్యమైన విజయాన్ని అందించాడు. రాజస్థాన్‌కు చెందిన ఈ కుర్రాడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముకుల్ చౌదరి నేపథ్యం, ఐపీఎల్ ప్రయాణం
ఆగస్టు 6, 2004న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జన్మించిన ముకుల్ చౌదరి.. కుడిచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్. రాజస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ముకుల్.. తన జిల్లా నుంచి ఐపీఎల్ స్థాయికి చేరిన మొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముకుల్ చౌదరి కోసం తీవ్ర పోటీ నెలకొంది. రూ.30 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ముకుల్ కోసం రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు పోటీ పడటంతో, చివరికి రూ.2.60 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

కెరీర్ ప్రారంభం
ముకుల్ చౌదరి తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రాన్ని జనవరి 17, 2023న రంజీ ట్రోఫీ ద్వారా చేశాడు. ఆ తర్వాత 2025లో విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్-ఎ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముకుల్ తన కెరీర్ ఆరంభంలో మీడియం ఫాస్ట్ బౌలర్‌గా ఉండేవాడు. అయితే ఆ తర్వాత వికెట్ కీపింగ్‌కు మారి, ఫినిషర్‌గా తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం దేశవాళీ టీ20ల్లో ఇతను 165కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
కేకేఆర్‌పై విజయం తర్వాత ముకుల్ మాటల్లో..
ఈడెన్ గార్డెన్స్‌లో లక్నోకు విజయాన్ని అందించిన అనంతరం ముకుల్ చౌదరి తన సంతోషాన్ని పంచుకున్నాడు."గతంలో యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్ చూసినప్పటి నుంచే మా నాన్నకు నాపై నమ్మకం పెరిగింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈడెన్ గార్డెన్స్‌లో ఆడటం గొప్ప అనుభూతి. మ్యాచ్‌ను గెలిపించగలననే నమ్మకం నాలో బలంగా ఉంది." అని ముకుల్ చౌదరి పేర్కొన్నాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చూపిన అద్భుత ప్రదర్శనే ముకుల్ చౌదరికి ఐపీఎల్ వేలంలో భారీ ధరను తెచ్చిపెట్టింది. కేవలం 21 ఏళ్ల వయస్సులోనే అత్యుత్తమ టాలెంట్‌గా ఎదిగిన ముకుల్, భారత క్రికెట్‌లో భవిష్యత్తు సూపర్ స్టార్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.