పాకిస్థాన్ క్రికెట్లో ఓ వింతైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. పాక్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన ఓ ఎంపికపై నెటిజన్లతో పాటు ఆ దేశ క్రికెటర్లు కూడా షాక్ అవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో, సాహిబ్జాదా ఫర్హాన్ తన అభిమాన ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ.. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, పాక్ మాజీ స్టార్ సయీద్ అన్వర్ కంటే కూడా అహ్మద్ షెహజాద్‌నే గొప్ప ఆటగాడిగా ఎంచుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అగ్రగామిగా వెలుగొందిన ఆటగాళ్లను కాదని, కేవలం షెహజాద్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ రియాక్షన్
ఈ వీడియోపై పాక్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ సాహిబ్జాదాను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
బాసిత్ అలీ: "ఇది వంద శాతం ఫేక్ వీడియో అయి ఉండాలి. సాహిబ్జాదాకు ఇంకా పిచ్చి పట్టలేదు కదా! సచిన్ కంటే అహ్మద్ షెహజాద్‌ను ఎంచుకోవడమేంటి? అతను అసలు స్పృహలోనే ఉన్నాడా అని అడగాలి. ఈ విషయం గురించి మాట్లాడడమే అనవసరం" అంటూ దండం పెట్టి మరీ వేడుకున్నారు.
కమ్రాన్ అక్మల్: ఈ విషయం వినగానే అక్మల్ నవ్వు ఆపుకోలేకపోయారు. "అతను ఓ క్రికెటర్, కనీసం ఆలోచించి మాట్లాడాలి. అహ్మద్ షెహజాద్ నీకు ఐడల్ కావచ్చు, కానీ సయీద్ అన్వర్, సచిన్ కంటే మెరుగైన వాడు అని చెప్పడం ఏమాత్రం సరికాదు" అని విమర్శించారు. చివరగా, సాహిబ్జాదా చేసిన ఈ 'తప్పు'కు తామే అందరికీ క్షమాపణలు చెబుతున్నామని వీరిద్దరూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఫర్హాన్ కెరీర్
పాక్ క్రికెటర్ టీ20ల్లో 37 మ్యాచ్‌లు ఆడి 917 పరుగులు చేశాడు. అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తాత్కాలిక జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఇప్పటివరకు వన్డే, టెస్టు అరంగేట్రం చేయలేదు.ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 31 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉండటంతో, ఫర్హాన్ తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది వేచి చూడాలి.