శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోవడంతో టీమిండియా విమర్శలు వస్తున్నాయి. కోచ్ గంభీర్ తో పాటు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మ్యాచ్ లో రోహిత్ శర్మ సరిగా ప్లాన్ చేయాలేదని విమర్శలు వస్తున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఫుల్ టైమ్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బదులుగా రియాన్ పరాగ్ ను తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టులో ఉన్నాడు. మరో పార్ట్ టైమ్ ఫాస్ట్ బౌలర్ అయిన శివమ్ దూబే పవర్ ప్లే ఓవర్లు బౌల్ చేశాడు.
మహ్మద్ సిరాజ్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన శివమ్ దూబే 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లందరూ కనీసం మూడు పరుగులు ఇవ్వగా, శివమ్ దూబే ఓవర్‌కు 2.25 పరుగులు మాత్రమే ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అలాగే అతని 24 బంతుల్లో 18 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆ 18 బంతుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఒక్క పరుగు కూడా చేయలేదు. శివమ్ దూబేకు పవర్ ప్లే ఓవర్లకు మించి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. మహ్మద్ సిరాజ్ పరుగులిచ్చినా అతన్ని బౌలింగ్ కొనసాగించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

దీంతో కెప్టెన్ ప్లాన్ సరిగా లేదని విమర్శలు వచ్చాయి. శివమ్ దూబేకి బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే శ్రీలంక 10 లేదా 20 పరుగులు తక్కువ చేసి ఉండేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే 20 పరగులు తక్కువ చేసినా ఇండియా గెలిచుండేది కాదని.. ఎందుకంటే భారత్ 110 పరుగుల తేడాతో ఓడిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. బుధవారం మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.
అవిష్క ఫెర్నాండో సెంచరీకి 4 పరుగుల దూరంలో ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ 59 పరుగులు చేయగా... నిస్సానక 45 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీయగా.. అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.1 ఓవర్లలోనే అలౌట్ అయింది. వెల్లలాగే 5 వికెట్లు పడగొట్టాడు.