T20 World Cup: ఇంగ్లండ్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన బెన్ స్టోక్స్.. అంత పట్టుదల ఎక్కడిది?

అది 2019 వన్డే ప్రపంచకప్.. ఛేజింగ్ సమయంలో ఇంగ్లండ్ జట్టు కీలక ఆటగాళ్లు చేతులెత్తేసిన ఒకేఒక్కడు ఒంటరిపోరాటం చేసి జట్టును చివరి వరకూ తీసుకెళ్లాడు. మళ్లీ 2022లో అదే సీన్ రిపీట్ అయింది. పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని, ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. ఆ ఆటగాడే బెన్ స్టోక్స్. 'అత్యంత పోటీ మనస్తత్వం ఉన్న మనిషి' అని విరాట్ కోహ్లీ కితాబిచ్చిన స్టోక్స్‌ను అందరూ 'టఫ్ ప్లేయర్' అని పిలుస్తారు. అతనికి ఇంత పట్టుదల ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

రగ్బీ మ్యాచ్..
అది 1980వ దశకం. వెల్లింగ్టన్‌లో రగ్బీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఆ మ్యాచ్‌లో ఆడుతున్నాడో ప్లేయర్. అక్కడ అదే అతని చివరి మ్యాచ్. ఆ తర్వాత ఇంగ్లండ్ చేరుకొని అక్కడ వర్కింగ్‌టన్‌తో కలవాల్సి ఉంది. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. గేమ్ మొదలైన ఐదు నిమిషాల్లోనే చేతివేలు విరిగింది. రగ్బీ వంటి ఆటలో గాయాలు సహజమే కానీ.. అతని గాయం సామాన్యమైంది కాదు. అతని వేలు విరిగి పూర్తిగా అడ్డంగా తిరిగిపోయింది. అంత పెద్ద గాయం.

టేప్ వేసుకొని..
ఆ వేలిని సరిచేయడం అప్పటికప్పుడు జరగదని మెడికల్ టీం చేతులెత్తేసింది. అయినా అతను మ్యాచ్ ఆడాలనే అనుకున్నాడు. అందుకే మరో ఆలోచన లేకుండా తనే ఆ వేలిని బలంగా స్ట్రెయిట్ చేసుకున్నాడు. దానికి టేపులు వేసుకొని మిగతా మ్యాచ్ అంతా ఆడాడు. అతను ఆ వేలిని సరిగా సెట్ చేయకపోవడంతో ఆ జాయింట్ అప్పటికే విరిగిపోయింది. వేలునొప్పితో ఉంటే ఫిట్‌నెస్ నిబంధనల ప్రకారం వర్కింగ్టన్‌తో డీల్ కూడా ముగుస్తుంది. అందుకే ఆ వేలికి టేప్ వేసుకొని, సీజన్ అంతా ఆడాడు. మరికొన్ని రోజుల్లో సీజన్ పూర్తవుతుందనగా.. అతని మోకాలికి కూడా గాయమైంది.

మోకాలితోపాటు వేలికి కూడా..
న్యూజిల్యాండ్ తిరిగొచ్చిన అతనికి చికిత్స చేసిన డాక్టర్లకు వేలి గురించి కూడా చెప్పాడతను. అది చూసిన డాక్టర్లు వేలికి కూడా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కానీ దానికి చాలా టైం పడుతుంది. అన్నిరోజులు జట్టుకు దూరమైతే ఆర్థికంగా కూడా నష్టమే. దీంతో కఠిన నిర్ణయం తీసుకొని వేలును తొలగించేయాలని డాక్టర్‌కు చెప్పాడు. ఆ డాక్టర్ ఎంత మొత్తుకున్నా వినలేదు. వంగిపోయి ఉన్న వేలి వల్ల రగ్బీ ఆటగాడికి ఉపయోగం లేదని గట్టిగా చెప్పేశాడతను. వేలు తీయించేసుకున్నాడు.

వేలు లేకుండా రగ్బీ..
చేతికి వేలు లేకుండా తన రగ్బీ కెరీర్ మళ్లీ ప్రారంభించాడతను. అతనే గెడ్ స్టోక్స్. తన పట్టుదల, పోరాటంతో ఇంగ్లండ్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన బెన్ స్టోక్స్ తండ్రి. ఎడంచేతిలో నాలుగున్నర వేళ్లతోనే రగ్బీ ఆడిన అతను.. మరో మ్యాచ్ ఆడుతుండగా ట్యాకిల్ చేసే సమయంలో ప్రత్యర్థి ఆటగాడి మోకాలు వచ్చి స్టోక్స్ తలకు బలంగా తగిలింది. దీంతో అతని మెడ ఎముక కూడా విరిగింది. దాంతో ఆటగాడిగా అతని రగ్బీ కెరీర్ ముగిసింది. అయినా ఆటకు దూరం కావడం ఇష్టం లేక కోచింగ్ కెరీర్ ప్రారంభించాడు.

తండ్రి జ్ఞాపకార్థం..
సుమారు రెండేళ్లుగా బెన్ స్టోక్స్ ఎలాంటి విజయం సాధించినా కూడా ఎడం చేతి మధ్య వేలును వంచేసి, కెమెరాకు ఆ వేలు లేనట్లు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిసిస్తోంది. అతను తన తండ్రి జ్ఞాపకార్థం అలా చేస్తాడు. 2020లో కేన్సర్ సోకడంతో అదే ఏడాది డిసెంబరులో 65 ఏళ్ల గెడ్ స్టోక్స్ స్వర్గానికి చేరుకున్నాడు. అది జరిగిన రెండేళ్ల తర్వాత మళ్లీ బెన్ స్టోక్స్ తన తండ్రికి ఘనమైన నివాళి అందించాడు. దేశం కోసం టీ20 ప్రపంచకప్ అందుకున్నాడు. గెడ్ స్టోక్స్ ఎక్కడున్నా తన కొడుకును చూసుకొని కచ్చితంగా గర్వపడతాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications