రంజీ ట్రోఫీలో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు సంపాదిస్తాడని భావించారంతా. విరాట్ కోహ్లి జట్టుకు దూరమవ్వడం, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడటంతో టీమిండియాలో అనుభవజ్ఞుడు పుజారా రీఎంట్రీ దాదాపు ఖరారైందనుకున్నారు. కానీ సెలక్టర్లు పుజారాకు మొండిచేయి చూపించారు. యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పుజారాను ఎంపికచేయలేదు.
అయితే జట్టులో చోటు దక్కనప్పటికీ భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పుజారా తెలిపాడు. ''నా జీవితంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే. దేశం కోసం బ్యాటుతో మైదానంలో బరిలోకి దిగడం ఎంతో గర్వంగా ఉంటుంది. అంతకుమించిన పెద్ద విషయం మరొకటి లేదు. మ్యాచ్‌ల్లో పోరాడి దేశాన్ని గెలిపించడం, X-ఫ్యాక్టర్‌గా లేదా ప్లేయర్‌గా జట్టులో ప్రభావం చూపిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చడం.. వంటి గొప్ప విషయాన్ని మించి ఈ భూమి మీద మరొకటి ఉండదు. ఇండియా తరఫున ఆడటానికి అవకాశం ఎప్పుడు వచ్చినా అభిరుచి, గర్వంతో సంసిద్ధంగా ఉంటా. ఇది ఎప్పటికీ మారదు'' అని పుజారా అన్నాడు.

36 ఏళ్ల పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టారు. శుభ్‌మన్ గిల్‌కు మూడో స్థానంలో అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా సత్తాచాటిన గిల్ వన్‌డౌన్‌లో విఫలమయ్యాడు. మొత్తంగా లయ అందుకుని వైజాగ్ టెస్టులో సెంచరీ సాధించాడు.
మరోవైపు పుజారా టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాలని రంజీ ట్రోఫీలో కసిగా పరుగులు సాధిస్తున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా సెంచరీల మోత మోగిస్తున్నాడు. రాజస్థాన్‌పై 110 పరుగులు సాధించాడు. అంతేగాక ఈ సీజన్‌లో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. 243 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
కానీ యువ ప్లేయర్లు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడికల్‌కు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు పుజారాను పక్కనపెడుతున్నారు. పుజారా 103 టెస్టుల్లో 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. కాగా, పుజారా సొంతగడ్డ అయిన రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ఆడనున్నాయి.