న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచ కప్ ట్వంటీ 20లో భారత్ పైన ఓడిన అనంతరం, కప్ నుంచి ఇంటి దారి పట్టిన అనంతరం పాకిస్తాన్ అభిమానులు ఆ జట్టు పైన దుమ్మెత్తిపోశారు.
పాకిస్తాన్ ఆటగాళ్ల పైన ఆగ్రహాన్ని ఆ దేశ అభిమానులు.. టీవీలు తదితర వస్తువుల పైన కూడా చూపించారు. అదే సమయంలో పాక్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యల పైన కూడా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ వ్యాఖ్యలు, ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

అహ్మద్ షెహజాద్, సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ అక్మల్ వంటి ఆటగాళ్లు స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఈ ప్రభావంతో షాహిద్ అఫ్రీది కెప్టెన్‌గా కూడా తప్పుకున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో బాగా రాణించాడు.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ సూచన చేశాడు. పాకిస్తాన్ బ్యాట్సుమెన్‌కు కొంత సాయం చేయాలని, మెలకువలు నేర్పాలని సూచించాడు. దానికి కోహ్లీ నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. పాకిస్తాన్ బ్యాట్సుమెన్, కోహ్లీ కలిసినప్పుడు.. క్రికెట్ తప్ప అన్నింటి గురించి మాట్లాడుతారని కోహ్లీ నుంచి ధీటైన సమాధానం వచ్చిందట.