న్యూఢిల్లీ : టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారంతో 35 వ వడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు అభిమానులు, అటు సహచర క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుకున్నాడు ధోని. అయితే అన్నింటిలోకి సెహ్వాగ్ చేసిన ట్వీట్, సురేశ్ రైనా ట్విట్టర్ లో పెట్టిన ధోని ఫ్లూట్ వీడియో అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ధోనికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్, ధోనిపుట్టినరోజైన జూలై 7న జాతీయ హెలికాప్టర్ దినంగా ప్రకటించాలంటూ ట్వీట్ చేయడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. క్రీజులో హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడే ధోని 2011 వరల్డ్ ఫైనల్ లో హెలికాప్టర్ తో మ్యాచ్ ను ముగించిన తీరును క్రికెట్ అభిమానుల గుండెలో చెరిగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ ట్వీట్ ధోని అభిమానులకు మరింత సంతోషాన్నిచ్చేదిగా మారింది.

ఇకపోతే ధోని బర్త్ డే సందర్బంగా టీమ్ ఇండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫ్లూట్ వీడియో అన్ని విషెస్ లో కెల్లా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. కాగా, ఫ్లూట్ వీడియోను చూసిన ధోని అభిమానులంతా, క్రీజులోనే కాదు ఫ్లూట్ వాయించడంలోను ధోని అదరగొడుతున్నాడే అని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సచిన్ టెండూల్కర్, కోచ్ అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా తదితరులు ధోనికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.