ఆక్లాండ్: భారత్ ఏ దేశంలో క్రికెట్ ఆడుతుంటే ఆ దేశంలో ఒంటి నిండా భారతదేశ జెండా రంగుతో సుధీర్ గౌతమ్ కనిపిస్తాడు. స్వతహాగా సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని అయిన సుధీర్ గౌతమ్‌ను చాలా సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ జరిమానాల నుంచి రక్షించాడు.
ఐతే ప్రస్తుతం ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ ఆడకున్న న్యూజిలాండ్‌లో సూపర్ ఫ్యాన్ సుధీర్ గౌతమ్‌ను జరిమానా నుంచి సచిన్ టెండూల్కర్ లెటర్ రక్షించింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్‌కు మద్దతుగా సుధీర్ గౌతమ్ స్టేడియాల్లో జాతీయ జెండాను ఊపుతూ క్రికెట్ అభిమానులకు ఛీర్ చేయడం చూశాం. పెయింట్ బాటిల్స్‌ను తీసుకెళ్తున్న సుధీర్ గౌతమ్‌ను ఆక్లాండ్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం న్యూజిలాండ్ కస్టమ్స్ పోలీసులు ఆపి, అతనికి రూ. 65,000 జరిమానా విధించారు.

దాంతో షాక్‌కు గురైన సుధీర్, తన వద్ద అంత డబ్బు లేదని పోలీసులను బ్రతిమలాడాడు. అంతే కాదు టీమిండియాకు తాను సూపర్ ఫ్యాన్ అని, జట్టు ఎక్కడికి వెళ్తే తాను కూడా ఒంటిపై జాతీయ జెండా రంగుతో అక్కడికి వెళ్తానని పోలీసులకు తెలిపాడు. అయినా సరే రూల్‌ను అతిక్రమించావు కాబట్టి జరిమానా కట్టాల్సిందేనని వారు తనపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపాడు. దీంతో వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా సచిన్ టెండూల్కర్ స్వయంగా రాసిచ్చిన లెటర్‌ను కస్టమ్స్ అధికారులకు చూపించడంతో జరిమానా నుంచి తప్పించుకున్నాడు.
ఆస్టేలియా-న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ 2015లో సుధీర్ గౌతమ్‌కు ఎలాంటి వీసా సమస్యలు రాకుండా ఉండేందుకు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఓ లెటర్‌ను సుధీర్‌కు రాసిచ్చాడు. మార్చి 6న పెర్త్‌లో భారత్ Vs వెస్టిండిస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఫ్లాగ్‌పోల్ విషయంలో తాను సమస్యను ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్లాగ్‌పోల్‌ని ఉపయోగించనని చెప్పిన తర్వాతే స్టేడియంలోకి తనకి అనుమతిచ్చినట్లు సుధీర్ గౌతమ్ తెలిపాడు.

న్యూజిలాండ్ లా ప్రకారం పెయింట్ బాటిల్స్, తినేవి, ప్రూట్స్, స్వీట్స్, షూష్‌లో మట్టి లాంటివాటిని విమానాశ్రయాల్లోకి అనుమతించరు. నిబంధనలను అతిక్రమించిన వారికి భారీగా జరిమానాను విధిస్తారు. గతంలో టీమిండియా స్పిన్నర్ హార్బజన్ సింగ్‌కు బూట్లలో మట్టి ఉన్నందుకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.