ముంబై: భారత క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా ధనవంతుడు. అలాంటి సచిన్.. ఓ సమయంలో క్యాబ్‌కు డబ్బులు చెల్లించలేని పరిస్థితిని కూడా ఫేస్ చేయవలసి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ గుర్తు చేసుకున్నాడు.
ఓ సమయంలో తనకు తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు క్యాబ్‌కు ఇచ్చేందుకు డబ్బులు లేని పరిస్థితి ఉండేదన్నాడు. తాను అండర్ 15 క్రికెట్ గేమ్ ఆడేందుకు పుణే వెళ్లానని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు స్టేషన్ నుంచి క్యాబ్‌లో వచ్చేందుకు డబ్బులు కూడా లేకుండెనని చెప్పాడు.
'నాకు 12 ఏళ్ల వయస్సున్నప్పుడు ముంబై అండర్ 15 జట్టుకు సెలక్ట్ అయ్యాను. నేను సెలక్ట్ కావడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొంత డబ్బు తీసుకొని పుణే వెళ్లాను. అక్కడ మూడు మ్యాచులు ఆడేందుకు వెళ్లాను.' అని సచిన్ చెప్పాడు.

'నేను మ్యాచ్ ఆడాను. నేను 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యాను. నేను అసంతృప్తికి గురయ్యాను. అసంతృప్తితో డ్రెస్సింగ్ రూంకు వచ్చాను. ఏడ్చాను. ఆ తర్వాత తనకు మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే అక్కడ భారీ వర్షం కురుస్తోంది.' అని చెప్పాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'రోజంతా వర్షం కురుస్తుండటంతో ఏం చేయలేకపోయాం. దీంతో బయటకు వెళ్లాం. సినిమా చూశా. బయటకు వెళ్లి తిన్నాను. డబ్బు ఎలా పద్ధతిగా లేదా పొదుపుగా ఖర్చు చేయాలో అప్పుడు నాకు తెలియదు. డబ్బంతా ఖర్చు చేశాను.
ఆ తర్వాత రైలులో ముంబైకి వచ్చాను. నా వద్ద అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నేను రెండు పెద్ద సంచులు తీసుకు వచ్చాను. స్టేషన్లో దిగిన తర్వాత నేను శివాజీ పార్కు వైపు నడక సాగించాను. ఎందుకంటే అప్పుడు నా వద్ద ఒక్క రూపాయి లేదు.' అని టెండుల్కర్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.
అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు అంత రాలేదని చెప్పాడు. సచిన్ ఇంకా మాట్లాడుతూ.. 'ఒక్కసారి ఆలోచించండి. నా వద్ద ఫోన్ ఉండి ఉంటే.. నేను ఓ ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెడితే నా తండ్రి లేదా తల్లి నా డబ్బులు అరేంజ్ చేసేవారని, అప్పుడు తాను క్యాబ్ మాట్లాడుకొని వెళ్లేవాడిని' అని సచిన్ చెప్పాడు.