
చిరస్మరణీయంగా నిలిచిపోయేలా
సుదీర్ఘ కెరీర్‌లో తన నిరాడంబరత, మంచితనం, కచ్చితత్వంతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు ఈ ఓపెనర్. బ్యాటింగ్‌లో మెరుపులు చూపిస్తూ తన సత్తా చాటడమే కాక, టీమిండియా స్థాయి పెరగడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గంభీర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఔదార్యానికి 2009లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ నిదర్శనంగా నిలిచింది.

316 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఉపుల్ తరంగ (118), కుమార సంగక్కర (60) దూకుడుగా ఆడారు. ఇలా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్నిచ్చింది. ఛేదనకి దిగిన భారత్‌లో.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (10), స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ (8)లు ఆరంభంలోనే ఔటయ్యారు. దాంతో 23/2తో కష్టాల్లో పడింది.
కోహ్లీతో కలిసి అభేద్యమైన ఇన్నింగ్స్ ఆడిన గంభీర్
ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి గౌతమ్ గంభీర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఈ జోడీ మూడో వికెట్‌కి అభేద్యంగా 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. విరాట్ కోహ్లి (107) కెరీర్‌లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేసి ఔటయ్యాడు. కానీ.. పట్టు వదలని గంభీర్ ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (19)తో కలిసి 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టుని విజేతగా నిలిపాడు.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును కోహ్లీకి ఇవ్వమని
ఆఖరి వరకూ క్రీజులోని నిలిచిన గౌతమ్ గంభీర్ 150 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో అతనికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. కానీ.. ఆ అవార్డుని తొలి సెంచరీ బాదిన విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందిగా గౌతమ్ గంభీర్ మ్యాచ్ నిర్వాహకులకి సూచించి గొప్ప మనసు చాటుకున్నాడు. యువ క్రికెటరైన కోహ్లీకి ఆ అవార్డు ప్రోత్సాహకంగా ఉంటుందని అప్పట్లో గంభీర్ ఇచ్చినట్లుగా సమాచారం.


Click it and Unblock the Notifications












